మొదటి రోజు స్కూల్ కి పంపే సమయంలో.. కొత్త బ్యాగ్,కొత్త డ్రెస్సు, అన్నీ కొత్తవి కొనేస్తారు. యూనిఫాంలో పిల్లలను చూసి మురిసిపోతారు. చాలా ఆనందపడతారు. కానీ, పిల్లల్లో కూడా తెలికుండానే కొన్ని మార్పులు వస్తాయి

మూడేళ్లు నిండగానే పిల్లలను స్కూల్ కి పంపాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. పిల్లలు మొదటిసారి స్కూల్ కి వెళ్లినప్పుడు పేరెంట్స్ చాలా ఎగ్జైట్ అవుతారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని.. ఫీజు ఎక్కువ అయినా మంచి స్కూల్లో చేర్పించాలని అనుకుంటారు. మొదటి రోజు స్కూల్ కి పంపే సమయంలో.. కొత్త బ్యాగ్,కొత్త డ్రెస్సు, అన్నీ కొత్తవి కొనేస్తారు. యూనిఫాంలో పిల్లలను చూసి మురిసిపోతారు. చాలా ఆనందపడతారు. కానీ, పిల్లల్లో కూడా తెలికుండానే కొన్ని మార్పులు వస్తాయి. పిల్లల మనసులో నిశ్శబ్దంగా జరిగే మార్పులు ఒక కొత్త దశను సూచిస్తాయి. ఈ మార్పులు ఒక్కసారిగా కనిపించకపోయినా నెమ్మదిగా వస్తూ ఉంటాయి. అవి పిల్లల ప్రవర్తన, భావోద్వేగ పరిస్థితి, ఆలోచనా సరళి సంబంధాలను నిర్మించడంలో బలమైన పాత్ర పోషిస్తాయి. మరి, పిల్లల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో తెలుసుకుందామా...

1. ఎదుటివారిని గమనించడం..

స్కూల్ కి వెళ్లక ముందు ఇంట్లో పిల్లలను చాలా గారాభంగా పెంచుతారు. వారు కోరుకున్నదల్లా తెచ్చి తమ ముందు పెడుతూ ఉంటారు. కానీ, ఒక్కసారి స్కూల్ కి వెళ్లడం మొదలుపెట్టిన తర్వాత.. అలా ఉండదు.అకస్మాత్తుగా మార్పులు రావడం మొదలౌతుంది. స్కూల్ కి వెళ్లిన పిల్లలు అకస్మాత్తుగా ఇతరుల పట్ల తాము ఎలా కనిపిస్తున్నామనే విషయంపై ఆసక్తి కనబరుస్తారు. ఒంటరిగా ఆడుకునే పిల్లలు, ఇప్పుడు తమ క్లాస్మెట్స్ ఏం చేస్తున్నారు..? వాళ్లు ఏమి తీసుకువస్తున్నారు? అనే విషయాన్ని ఆసక్తిగా గమనించడం మొదలుపెడతారు. ఇది వారి సామాజిక గుర్తింపు మొదలౌతుంది అనడానికి సంకేతం. అంతేకాదు.. తాము కూడా అందరిలా ఉన్నామా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. తాము వాళ్లలా ఉండాలంటే ఏం చేయాలి అని చూస్తారు.

2.తమ వస్తువులపై బాధ్యత..

స్కూల్ కి వెళ్లే పిల్లలకు కొత్త బ్యాగ్, కొత్త వాటర్ బాటిల్ ఇచ్చి పంపిస్తారు. అన్నింటికీ.. వారి పేరుతో నేమ్ ట్యాగ్ చేసి పంపిస్తూ ఉంటాం. దీని వల్ల పిల్లలకు తమ వస్తువులపై ఒకరకరమైన బాధ్యత పెరుగుతుంది. నేమ్ ట్యాగ్, వాటర్ బాటిల్, పెన్సిల్ బాక్స్ వంటి చిన్న వస్తువులకూ అసాధారణంగా ప్రాధాన్యత ఇస్తారు. ఇది వారికే చెందిందన్న గట్టి అనుభూతిని కలిగించడమే కాదు, కొత్త ప్రదేశంలో పరిచయం అయిన వస్తువులతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు. నెమ్మదిగా స్కూల్ టైమింగ్స్ కీ, ఏ సమయంలో స్నాక్స్, ఏ సమయంలో లంచ్ తినాలి అనే విషయం అలవాటు పడుతుంది.

3. ఆలోచనాత్మక విరామాలు ఏర్పడడం:

పాఠశాల ప్రారంభమైన కొద్ది రోజుల తరువాత, పిల్లలు ఏదైనా పనిని చేయకముందు చిన్న విరామం తీసుకోవడం గమనించవచ్చు. ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం, చేయి ఎత్తేముందు ఆలోచన, రంగు ఎంపికలో వెనకడుగు... ఇవన్నీ వారి మనసులో "ఇది సరైనదా?", "ఇతరులు నవ్వుతారా?" అనే సందేహాలు మొదలౌతాయి. ఈ మార్పులు వారిలో అంతర్గత విశ్లేషణ ప్రారంభమైందని సూచించవచ్చు.

4. భావోద్వేగ అలసట:

పాఠశాల తరువాత పిల్లలు అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంటారు లేదా చిన్న కారణాలకు కన్నీళ్ళు పెడతారు. ఇది విచారం కాదు, ఇది భావోద్వేగ అలసట. రోజంతా నిబంధనలు పాటించడం, సమూహంలో తలదాచుకోవడం, బహిరంగంగా మాట్లాడకలేకపోవడం వారికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది వారికి చాలా గందరగోళంగా అనిపిస్తుంది. కానీ, కొద్ది రోజులకు వారు స్కూల్ కి అలవాటు పడిపోతారు.

5. భాషా స్వరంలో మార్పులు:

ఉపాధ్యాయుల మాటల ధోరణి పిల్లల్లో పునరావృతమవుతుంది. “అలా చేయకూడదు”, “ఇది మనం కలసి చేద్దాం” వంటి మాటల వాడకాన్ని వారు అలవర్చుకుంటారు. ఇది కేవలం అనుకరణ మాత్రమే కాదు. ఇది పాత్రను అభినయించడంలో భాగం. ఉపాధ్యాయులు అధికారానికి, మార్గదర్శనానికి నిలువెత్తు ప్రతిరూపం అవుతారు. పిల్లలు తెలియకుండానే టీచర్స్ మాట వినడం అలవాటు చేసుకుంటారు.

6. స్వీయ అవగాహన పెరుగుదల:

ఇంతకుముందు చింతించని విషయాలు ఇప్పుడు పిల్లల దృష్టిలోకి వస్తాయి—తాము ఎలా కనిపిస్తున్నాము, ఇతరులు తమను ఎలా చూస్తారు. స్కూల్ కి వెళ్లే ముందు జుట్టు సరిచేసుకోవడం, బట్టలు సర్దుకోవడం మొదలవుతాయి. స్వీయ అవగాహన పెరగడం అంటే తాము సమూహంలో ఒక వ్యక్తిగా తమను చూసుకోవడం. ఇది వాళ్లలో నెమ్మదిగా రూపాన్ని, ప్రవర్తనను , ఆత్మవిశ్వాసాన్ని నిర్మించడంలో కీలకంగా మారుతుంది.

పాఠశాల ప్రారంభం అనేది కేవలం విద్యా ప్రయాణం ఆరంభమే కాదు. అది చిన్నపిల్లలు సమాజంతో పరిచయం అయ్యే తొలి వేదిక. ఈ దశలో వారిలో సంభవించే సూక్ష్మ మార్పులు వారి జీవితాన్ని అర్థవంతంగా మారుస్తాయి. తల్లిదండ్రులు ఈ మార్పులను గమనించి, సానుభూతితో స్పందిస్తే, పిల్లలు మరింత నమ్మకంగా, సంతోషంగా ఈ మార్గాన్ని కొనసాగించగలుగుతారు. ఈ మార్పుల విశ్లేషణ, పిల్లల మనసులో నెమ్మదిగా మారుతున్న మానసిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు ఒక కిటికీలా ఉంటుంది.