Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రి వివాదం: కేసీఆర్ కృష్ణదేవరాయలా, మోనార్కా?

యాదాద్రి వివాదంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తిరుమలలో శ్రీకృష్ణ దేవరాయల ప్రతిమ ఉన్నట్లే యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ చిత్రం ఉంటుందని ఆనందసాయి వాదిస్తున్నారు.ఇదేమైనా రాచరిక వ్యవస్థనా? 

Yadadri controversy: Is KCR Srikrishna devarayalu?
Author
Yadadri Hills, First Published Sep 7, 2019, 2:53 PM IST

కెసిఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం ఇప్పుడు వివాదాల ఊబిలో చిక్కుకుంది. తెలంగాణ తిరుమలగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించిన కెసిఆర్ అందుకు తగ్గట్టుగానే భారీస్థాయిలో నిర్మాణ పనులను చెప్పట్టాడు. సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవమున్న ఆనంద్ సాయికి ఈ బాధ్యతలను అప్పగించాడు. నిర్మాణం ప్రారంభమైననాటినుండి యాదాద్రి పనులు శరవేగంగా పూర్తవుతూ వస్తున్నాయి. 

ఇలా అంతా బాగానే సాగుతుంది అనుకుంటున్న తరుణంలో అష్టభుజిప్రాకార మండపంలోని స్థంబాలపైన కెసిఆర్ చిత్రాన్ని చెక్కడంతో  ఆధ్యాత్మిక ప్రశాంతతతో అలరారే యాదాద్రి రాజకీయ సంగ్రామ క్షేత్రంగా మారింది. ఈ ప్రాకారంలో కెసిఆర్ చిత్రపటంతోపాటు కెసిఆర్ హయాంలో చేపట్టిన పథకాలైన హరిత హారం, కెసిఆర్ కిట్, రాష్ట్రపక్షి, జంతు బొమ్మల చిత్రాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు గాంధీ వంటి మహోన్నతుల చిత్రపటాలుకూడా ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఇంకా ఎన్నో చిత్రాలు కూడా కొలువయ్యాయి. 

ఎప్పుడైతే ఇలా కెసిఆర్ చిత్రపటంతో పాటు ఇతర రాజకీయ చిహ్నాలున్న విషయం బయటకు పొక్కిందో ఇదో పెద్ద దుమారానికి తెరలేపింది. విపక్షాలన్నీ గొంతెత్తి ఏమిటి ఈ అన్యాయం అని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణాలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇవాళ యాదాద్రికి వెళ్లనున్నట్టు నిన్న విడుదల చేసిన వీడియోలో వెల్లడించాడు. కాంగ్రెస్ నాయకులు రేపు వెళుతున్నారు. ఆధ్యాత్మిక రాజధానిగా విలసిల్లాల్సిన యాదాద్రి ఇప్పుడు రాజకీయాలకు రాజధానిగా మారింది. 

ఈ విషయాన్ని పరిశీలించే ముందు, ఒకసారి తిరుపతి గుడిని గుర్తుచేసుకుంటే, అందులో శ్రీకృష్ణదేవరాయుల విగ్రహాన్ని మనం ఆలయ ప్రాకారంలో చూడవచ్చు. అది రాచరిక వ్యవస్థ. అప్పుడు రాజులు ఏకంగా తమకు తాము దేవుడి వారసులుగా ప్రకటించుకునేవారు. రాజ్యం అనే ప్రైవేట్ కంపెనీలకు ఓనర్లుగా, రాజ్య సంపద వారి సొంత సంపదగా భావించేవారు. అందుకే వారు తమ ప్రతిమలను గుళ్ళల్లో పెట్టించుకున్నా ఎవరూ అడ్డుచెప్పేవారు కాదు. 

అది రాచరికం. ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు కూడా ఆ రాచరిక వాసనలు పొడచూపుతూ ఉండడం నిజంగా బాధాకరం. ఇలా చిత్రపటాలను చెక్కమని పైనుంచి ఆదేశాలు వచ్చాయా, లేక కిందున్నవారే స్వామి భక్తితో చెక్కారో తెలీదు కానీ, ఇలా చెక్కడం మాత్రం శోచనీయం. 

నిన్న రాత్రి ఈ వివాదం బాగా ముదురుతోంది అనుకోగానే, కొద్దిమంది అధికారులు ప్రెస్ మీట్ పెట్టి పైనుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు, అక్కడున్న శిల్పులు చెక్కారు అని చెప్పారు. వారు ఎంత చెప్పినప్పటికీ, దాన్ని పర్యవేక్షించడానికి ఎందరో అధికారులు ఉన్నారు. ఆలయ ఈఓ ఉన్నారు, ఎందరో గ్రూప్ 1 స్థాయి అధికారులు నిత్యం అక్కడ ఆ నిర్మాణ పనులను వేర్వేరు హోదాల్లో పరిశీలిస్తూ నిర్మాణ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో నివేదికలు పంపుతూ ఉంటారు. వారు ఇలాంటి చిత్రాలను గమనించలేదు అంటే హాస్యాస్పదమే అవుతుంది. 

వారు అత్యున్నత స్థాయి ప్రభుత్వాధికారులు. వారికి ఏది రాజ్యాంగబద్ధమో, ఏది రాజ్యాంగ విరుద్ధమో ఖచ్చితంగా తెలుసు (రాజ్యాంగ విరుద్ధమెందుకో కింద చర్చించుకుందాము). తెలిసి కూడా వారెందుకు ఈ పనిని ఆపలేదు? పోనీ నేరుగా ఆపకున్నా, ఈ విషయాలను ప్రభుత్వానికి నివేదించలేదా? నివేదించినా  ప్రభుత్వం పట్టించుకోలేదా? ఇన్ని ప్రశ్నల నేపథ్యంలో దీన్ని సమీక్షిస్తే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఇది జరిగింది అని అనిపిస్తుంది. 

ఇలా ఎందుకు చెప్పవలిసి వస్తుందంటే, నిన్న రాత్రి అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. వారు ఈ విషయాలపైన మాట్లాడడానికి వచ్చారంటే, అంతకు పూర్వమే ఈ విషయాలపై ప్రభుత్వం ఆరాతీసి ఉంటుంది. ఎం మాట్లాడాలో ఏంటో చెప్పే ఉంటారు. అయినప్పటికీ వారు వచ్చి మాట్లాడిన మాటలు విస్మయానికి గురిచేశాయి. 

వారు మాట్లాడుతూ వీటిని శిల్పులు చెక్కారు. వారికి పనికలిపించిన వ్యక్తి కెసిఆర్ ని దైవంగా భావించి వారు ఈ చిత్రాన్ని చెక్కారన్నారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. మరి ఇలా చెక్కడం తప్పుకాదా అని ప్రశ్నిస్తే, తప్పేలా అవుతుందంటూ ఎదురుప్రశ్న వేశారు కూడా! ఈ శిల్పాన్ని తొలగించే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పారు. అధికారులు మారీ ఇంత స్వామిభక్తిని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? 

పోనీ అప్పటికి కూడా ఇంకా ముఖ్యమంత్రి గారికి తెలియలేదు అనుకుందాం. వారి సలహాదారులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రిగారికైతే, ఈ ప్రెస్ మీట్ పూర్తయ్యేసరాకైతే తెలిపిఉంటారు కదా! కనీసం నేటి మధ్యాహ్నానికి కూడా ఈ విషయంపై ముఖ్యమంత్రిగారు కానీ, వారి కార్యాలయం కానీ స్పందించలేదు. 

ప్రెస్ మీట్ కి వచ్చిన అధికారులను తెరాస పార్టీ ఎన్నికల గుర్తు అంబాసిడర్ కారును ఎందుకు చెక్కారు అంటే, నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా ఈ శిల్పాలను చెక్కమన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, అంబాసిడర్ కార్ల ఉత్పత్తి ఆగిపోయి చాలాకాలం అయ్యింది. వేరే మోడల్ కార్ ఏది దొరకానట్టు, ఈ మోడల్ కారునే ఎందుకు చెక్కావలిసి వచ్చింది? అంతే కాకుండా ఈ కారు బొమ్మను ఏదో ఒక పెద్ద సమాజ చిత్రీకరణలో భాగంగానో వేసివుంటే ఏదో అనుకునేవాళ్ళమేమో, దీన్ని ప్రత్యేకంగా ఒక పిల్లర్ పైన పూర్తిగా చెక్కారు. ఇది మరీ విడ్డూరంగా లేదూ!

ప్రెస్ మీట్ లో సమయం గడుస్తున్నకొద్దీ దీని వెనకున్న పూర్తి స్కెచ్ అర్థమవుతూ వచ్చింది.  తెరాస పథకాలను ఎందుకు చెక్కారు అనే ప్రశ్న ఎదురవ్వగానే, కెసిఆర్ హయాంలో దీన్ని నిర్మిస్తున్నారు గనుక చరిత్రలో ముందుతరాలకు ఇది తెలియపరచడానికి అంటూ అసలు విషయాన్ని తెలిపారు. 

నిజమే ఈ బృహత్తర భగీరథ ప్రయత్నాన్ని కెసిఆర్ మొదలుపెట్టాడు, పూర్తిచేస్తాడు కూడా. ఆ విషయాన్ని ఎప్పటికి గుర్తుచేయడానికి శిలాఫలకాలు, ప్రత్యేక గ్యాలరీలు అన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఈ మార్గాన్ని ఎంచుకోవడం ఎందుకు? 

అధికారం శాశ్వతం కాదు. కానీ చరిత్ర శాశ్వతం. ఇలా నేడు చరిత్రలో నిలిచిపోవడానికి కెసిఆర్ ఇలాంటి పనులకు పాల్పడితే, రేపు మరో పార్టీ అధికారంలోకి రాగానే కెసిఆర్ చరిత్రను చెరిపేసి తమ చరిత్రను చెక్కించుకోవడానికి పూనుకోరు అనే గ్యారెంటీ ఎమన్నా ఉందా? ఇలా అన్ని రాజకీయ పార్టీలు తెగబడితే అభివృద్ధి అటకెక్కి కూల్చివేత-నిర్మాణ-పునర్నిర్మాణ  ఛట్రంలోనే చరిత్ర, డబ్బు మంటగలిసిపోతుంది. 

అయినా వెనకటి దేవాలయాల్లో సమాజ చిత్రీకరణ జరిగేది అంటే అది అప్పటి చరిత్రను కాపాడుకోవడం కోసం. అప్పుడు ఇలా ఇంటర్నెట్ అందుబాటులో లేదు.  కాబట్టి చరిత్రను భావితరాలకు అందించడానికి అదొక్కటే మార్గం. ఈ కాలంలో కూడా ఇలాంటి నిర్మాణాలపైన చరిత్ర, సామాజిక వర్ణనల ముసుగులో రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు?

సామాజిక చిత్రీకరణవరకైతే ఫరవాలేదు. తెలంగాణ చిహ్నాలు, సాంస్కృతిక వారసత్వ సాంప్రదాయాలను ఎవ్వరూ ప్రశ్నించాల్సిన అవసరంలేదు. కాకపోతే వాటిని రాజకీయాలతో ముడిపెట్టడం అదీ, ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో అవసరమా చెప్పండి?

ఇక రాజ్యాంగ పరంగా గనుక మాట్లాడుకుంటే, రాజకీయాలను మతానికి ముడిపోట్టొద్దు అనేది రాజ్యాంగంలో పేర్కోబడిన అంశం. ఎన్నికల నియమావళిలో ఓట్లడగడమే తప్పైతే, ఇలా ఏకంగా ఆధ్యాత్మిక క్షేత్రాన్నే రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. 

ఈ నిర్మాణాన్ని కెసిఆర్ తన సొంత డబ్బుతో కడుతోంది కాదు. ఈ నిర్మాణానికి వినియోగించే ప్రతి పైసా ప్రజల సొమ్ము. ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు కేవలం కెసిఆర్ భక్తులే కాకుండా ఇతర సాధారణ భక్తులు కూడా వస్తారు. ఇటువంటి రాజకీయ చిహ్నాలను చెక్కడం వల్ల వారి మనోభావాలు దెబ్బతింటాయి. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కెసిఆర్ పాత్ర కీలకం. దాన్ని ఎవరూ కాదనలేరు కూడా. చరిత్రలో నిలిచిపోవాలంటే, ప్రజారంజక పాలనను అందించి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకోవాలి తప్ప ఇలాంటి ఆధ్యాతిక క్షేత్రాల్లో కాదు. 

ముగించేముందు, నిన్న రాత్రి ఈ పూర్తి ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ఆర్ట్ డైరెక్టర్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఒక విస్మయపరిచే విషయం తెలిపాడు. అదేంటంటే, తిరుమలలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం లేదా అంటూ మాట్లాడాడు. ఈ విషయాన్నిబట్టి చూస్తుంటే ఒక నూతన కోణం ఆవిష్కృతమవుతుంది. 

 రాచకొండ కమిషనరేట్ ఏర్పాటుపైన ఎప్పటినుంచో ఒక ఆక్షేపణ ఉంది. రాచకొండ అనే పేరును రాచరిక ఛాయలను పొడచూపేటందుకే ఆలా కెసిఆర్ నామకరణం చేశారని అప్పట్లో కొందరు అన్నారు. అప్పుడే ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం, పోలీసు శాఖను ప్రజలకు మరింత చేరువచేసేందుకు ఇలాంటి వికేంద్రీకరణ జరుపుతున్నట్టు అప్పడు ప్రభుత్వం చెప్పింది. దీన్ని రాజకీయం చేయొద్దని హితవు పలికింది కూడా. 

కానీ నిన్నటి ఆనంద్ సాయి మాటలను చూస్తుంటే మాత్రం నేటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో రాచరిక వాసనలు పొడచూపుతున్నాయేమో అనే అనుమానం కలుగక మానదు. 

సంబంధిత వార్తలు

కేసీఆర్ చిత్రాలు: యాదాద్రిలో రాజాసింగ్ హల్ చల్, ప్రభుత్వానికి అల్టిమేటమ్

యాదాద్రిపై కేసీఆర్ సారు శిల్పాలు (ఫొటోలు)

ఆయనకు దేవుడు, యాదాద్రిపై అందుకే కేసీఆర్ బొమ్మ చెక్కాడు: కిషన్ రావు

యాదాద్రి శిల్పాలపై అధికారుల వివరణ: భావి తరాల కోసమే కేసీఆర్, కారు చిత్రాలు, రాజకీయ ఉద్దేశం లేదు

యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ బొమ్మలు

Follow Us:
Download App:
  • android
  • ios