యాదాద్రి: బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్ శనివారంనాడు యాదాద్రిలో సందడి చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రాకారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చిత్రాలను చెక్కడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాసింగ్ యాదాద్రిని సందర్శించారు. 

ఆలయ ప్రాకారాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో స్తంభానికి కేసీఆర్ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపున్న అష్టభుజి ప్రాకార మండపంలో కారు గుర్తు, కేసీఆర్ కిట్టు, తెలంగాణ లోగోలో చార్మినార్ ను చెక్కారు. రాజాసింగ్ శనివారం స్థానిక బిజెపి నేతలతో కలిసి పరిశీలించారు. 

యాదాద్రి స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలను చెక్కడంపై రాజా సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈలోగా వాటిని తొలగించకపోతే అన్ని దేవాలయాల్లో ఆందోళనలు చేస్తామని చెప్పారు. 

ముఖ్యమంత్రి కేసీార్ యాదాద్రిని ప్రపంచ స్థాయి క్షేత్రంగా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే కేసీఆర్ బొమ్మలను చెక్కడం సరి కాదని ఆయన అన్నారు.  రాష్ట్ర నాయకత్వంతో చర్చించి త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. భావి తరాలకు తెలియజేయడానికి నాయకుల బొమ్మలను చెక్కినప్పుడు వారి అవినీతిని కూడా చెక్కుతారా అని ప్రశ్నించారు. 

యాదాద్రిపై కేసీఆర్, కారు, కేసీఆర్ కిట్టు, హరితహారం వంటి చిత్రాలను చెక్కడాన్ని వ్యతిరేకిస్తూ భజరంగ దళ్, హిందూ పరిరక్షణ సమితి, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు నిరసనకు దిగాయి. కాంగ్రెసు నేతలు కూడా యాదాద్రి వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

యాదాద్రిపై కేసీఆర్ సారు శిల్పాలు (ఫొటోలు)

ఆయనకు దేవుడు, యాదాద్రిపై అందుకే కేసీఆర్ బొమ్మ చెక్కాడు: కిషన్ రావు

యాదాద్రి శిల్పాలపై అధికారుల వివరణ: భావి తరాల కోసమే కేసీఆర్, కారు చిత్రాలు, రాజకీయ ఉద్దేశం లేదు

యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ బొమ్మలు