విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ హీరో జూ.ఎన్టీఆర్ హాట్ టాపిక్ గా మారారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జూ. ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. రాజకీయ తెర మీద లేని జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఎందుకు రాజకీయం నడుస్తుందనేది కాస్తా ఆసక్తికరమైన చర్చనే. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ ను చర్చలోకి లాగారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ ను వంశీ తెర మీదికి తెచ్చారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు పక్కన పెట్టారనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. నారా లోకేష్ పై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. 

ఆయన దద్దమ్మ.. జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే: లోకేశ్‌పై కొడాలి నాని ఫైర్

జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టడంపై చంద్రబాబు మీద ఆయన విరుచుకుపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుని రావాలని చంద్రబాబు తనకూ ప్రస్తుత మంత్రి కొడాలి నానికి చెప్పారని, పదేళ్ల పాటు జూనియర్ ఎన్టీఆర్ ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పనిచేశారని ఆయన చెప్పారు. 

నారా లోకేష్ ను తన వారసుడిగా ముందుకు తేవడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి దూరం చేశారనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయంలో దివంగత నందమూరి హరికృష్ణ చంద్రబాబుతో విభేదించారు కూడా. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరమవుతూ వచ్చారు. తెలుగుదేశం కోసం తాను పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో ఒకటి రెండుసార్లు అన్నారు. కానీ చంద్రబాబు చొరవ చూపలేదు.

జూ.ఎన్టీఆర్ ని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం.. బాలయ్యని కూడా?

సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ద్వారా ఎన్టీఆర్ వారసత్వం తనదేనని ప్రకటించుకోవడానికి ప్రయత్నించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సమయంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని విషయాల్లో కొంత దుమారం కూడా చెలరేగింది. ఆ సమయంలో బాలకృష్ణకు కూడా జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్రమైన ఆగ్రహం వచ్చినట్లు చెబుతారు.

నందమూరి హరికృష్ణ అకాల మరణ సమయంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం మార్పేమీ రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉంటూ వస్తున్నారు. 

కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ను నారా లోకేష్ కోసం పక్కన పెట్టారని వంశీ, కొడాలి నాని తాజాగా చేసిన విమర్శల ఆంతర్యంగా కనిపిస్తోంది. అయితే, కొడాలి నాని, వంశీల వల్లనే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరమయ్యారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను కొడాలి నాని, వంశీ వాడుకుని వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. 

RRR: ఎన్టీఆర్ హీరోయిన్ పిచ్చ హ్యాపీ.. ఇండియా అద్భుతం అంటున్న లేడి విలన్!

జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేసింది చంద్రబాబు కాదని కూడా అన్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగంగాే టీడీపీకి దూరమయ్యారనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ వ్యవహారంలో తన పేరు చర్చలోకి వచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు. కొడాలి నాని, వంశీ తన పేరును ప్రస్తావిస్తూ చంద్రబాబుపై, నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించడం లేదు. 

ఎన్టీఆర్ పూర్తిగా సినిమాల మీదనే తన దృష్టి పెట్టారు. ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా, లేదా అనేది కూడా చెప్పలేని స్థితి. తాత పెట్టిన తెలుగుదేశం పార్టీకి మాత్రం తాను దూరం కాబోనని ఆయన గతంలో చెప్పారు. ఏమైనా, నారా లోకేష్ ను టార్గెట్ చేయడానికే వంశీ గానీ, నాని గానీ జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తోంది.