Asianet News Telugu

జూ.ఎన్టీఆర్ పార్ట్ టైమ్, హరీష్ ఫుల్ టైమ్: కేసీఆర్ కు అల్లుడి పోటు

మంత్రి ఈటల రాజేందర్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి గులాబీ గూటిలో పరిస్థితి అంత సజావుగా లేదని అర్తమవుతోంది. ఈటల వెంటనే సర్దుబాటు చేసుకుంటూ ప్రకటన ఇచ్చినప్పటికీ పరిస్థితి అంత సజావుగా నడుస్తోంది. అసలు కేసీఆర్ వ్యూహమేమిటి... అది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనేది చూద్దాం....

కామెంట్

Etela rajender context, Comparison between Jr NTR and Harish Rao
Author
hyderabad, First Published Aug 30, 2019, 3:40 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కామెంట్

మంత్రి ఈటల రాజేందర్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి గులాబీ గూటిలో పరిస్థితి అంత సజావుగా లేదని అర్తమవుతోంది. ఈటల వెంటనే సర్దుబాటు చేసుకుంటూ ప్రకటన ఇచ్చినప్పటికీ పరిస్థితి అంత సజావుగా నడుస్తోంది. అసలు కేసీఆర్ వ్యూహమేమిటి... అది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనేది చూద్దాం....

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వంపై తిరుగుబాటు స్వరం వినిపించిన మంత్రి ఈటల రాజేందర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యూటర్న్ తీసుకున్నారు. ఈటల ధిక్కార స్వరాన్ని కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంతరావు ఆహ్వానిస్తూ "శభాష్ ఈటల.. బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక" అని మెచ్చుకున్నారో లేదో పరిస్థితి తలకిందులైంది. బీసీలు ఎవరికీ తలవంచవద్దని, ఈటల మాట్లాడింది వంద శాతం సరైందని కూడా విహెచ్ అన్నారు. 

మంత్రి పదవి తనకు భిక్ష కాదని హుజూరాబాద్ సభలో ఈటల అనడం తరువాయి ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టాయి. బిజెపి నేత గడ్డం వినోద్ కూడా ఆయన మాటలను స్వాగతించారు. విహెచ్ గానీ గడ్డం వినోద్ గానీ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావుపై ఆగ్రహంతో ఈటల ప్రకటనను ఆహ్వానించారనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. 

ఈటల ఎందుకు అంతగా అసహనానికి గురి కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కేసీఆర్ వైఖరి కారణంగా ఆయన ఆత్మరక్షణలో పడ్డారనేది అందరికీ తెలిసిన విషయమే. నిజానికి, తొలి విడత ఈటలకు మంత్రి పదవి రావడమే చాలా ఆశ్చర్యకరం. హరీష్ రావునే కాకుండా ఈటల రాజేందర్ ను కూడా కేసీఆర్ పక్కన పెడుతారని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ కారణాలు స్పష్టంగా తెలియవు గానీ ఈటలకు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఈటల రాజేందర్ ఒక్కరే కేసీఆర్ ప్రియపాత్రుడు కాదనేది అందరికీ తెలిసిన విషయమే. 

హరీష్ రావు, ఈటల రాజేందర్ ఒక్క జట్టు అనే అభిప్రాయం బలంగా ఉంది. ఇరువురికి కూడా ప్రజల్లో పలుకుబడి ఉంది. మిగతావారిని తోసిపుచ్చినట్లుగా వారిద్దరినీ తోసిపుచ్చడం కేసీఆర్ కు అంత సులభం కాదని అందరూ అంటారు. కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం వల్ల హరీష్ రావును పక్కన పెట్టడానికి కేసీఆర్ కు వీలైంది. కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన కేసీఆర్, హరీష్ రావును పక్కన పెట్టాలని అనుకున్నప్పటికీ ఈటల రాజేందర్ విషయంలో సాధ్యం కాలేదు. 

ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే రకంగా ఉంటాయి. వాటి అధినేతలే శాసనకర్తలుగా ఉంటారు. కర్త, కర్మ, క్రియ అన్నీ వారే అవుతారు. తెలుగుదేశం, డిఎంకె, జెడీఎస్ ఏ పార్టీని చూసినా మనకు అదే కనిపిస్తుంది. ఇందుకు కేసీఆర్ అతీతులేమీ కాదు. వారసుల ఎంపిక విషయంలో వారిదే తుది నిర్ణయం అవుతుంది. సాధారణంగా తమ సంతానానికే పార్టీ పగ్గాలు అప్పగించడం ఆనవాయితీగా వస్తుంది. అందుకు అవసరమైన వ్యూహాన్నే వారు అనుసరిస్తారు. 

తెలుగుదేశం పార్టీనే తీసుకుందాం. ఎన్టీఆర్ నుంచి పార్టీని తన హస్తగతం చేసుకున్న చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ ను తన వారసుడిగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ అడ్డంకిగా కనిపించారు. దాంతో ఆయన వారిద్దరినీ పక్కన పెట్టేశారు. వారిద్దరినీ పక్కన పెట్టడానికి కొంత సమయం తీసుకున్నారు అదును చూసి తన వ్యూహాన్ని అమలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ పక్కకు వెళ్లారు. నారా లోకేష్ చంద్రబాబు తర్వాతి స్థానాన్ని ఆక్రమించారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ఉంటే బహుశా, లోకేష్ ముఖ్యమంత్రి అయి ఉండేవారేమో తెలియదు. కానీ వైఎస్ జగన్ టీడీపీని చావు దెబ్బ తీశారు. 

కేసీఆర్ చంద్రబాబు తరహాలోనే ఆలోచిస్తున్నారనేది వేరుగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి, కేటీ రామారావును ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని అనుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరిగాయని చెప్పవచ్చు. కలెక్టర్ల సమావేశానంతరం జరిగిన ఓ ఘటనను ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. తొలి విడత టీఆర్ఎస్ ఏలుబడిలోనే అది జరిగింది. సాధారణంగా సమావేశానంతరం కలెక్టర్లతో ముఖ్యమంత్రి గ్రూప్ ఫొటో దిగుతారు. కానీ కలెక్టర్లతో కేటీఆర్ గ్రూప్ ఫొటో దిగారు. అప్పుడే కేసీఆర్ ఆంతరంగమేమిటో తెలిసిపోయింది. కేటీఆర్ తన వారసుడనే విషయాన్ని కేసీఆర్ తనంత తానుగా చెప్పకుండా ఆ విషయాన్ని అందరూ గ్రహించేట్లు చేశారు. 

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్, హరీష్ రావు సమఉజ్జీలుగా ఉంటూ వచ్చారు. కానీ గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయంతో హరీష్ రావును తగ్గించి, కేటీఆర్ ను ఎత్తడానికి కేసీఆర్ కు వీలైంది. ఆ తర్వాత హరీష్ రావుపై కేటీఆర్ క్రమపద్ధతిలో పైచేయి సాధిస్తూ వచ్చారు. కేసీఆర్ అండదండలతో ఆయన ఆ పని చేస్తూ వచ్చారు. అయితే, కేటీఆర్ ను తన స్థానంలో నిలపడానికి తగిన సందర్భం రాలేదు.

లోకేష్ ను వారసుడిగా ముందుకు తేవడానికి ఉన్న ఆటంకాలను చంద్రబాబు తొలగించినట్లే కేసీఆర్ కూడా కేటీఆర్ కు ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరికి కూడా అల్లుళ్ల గొడవే. అదును చూసి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారు. కేటీఆర్ కు తన వారసత్వాన్ని దారాదత్తం చేయడానికి కేసీఆర్ కు హరీష్ రావును పక్కన పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. హరీష్ రావు జూనియర్ ఎన్టీఆర్ మాదిరిగా పార్ట్ టైమ్ పొలిటిషియన్ కాదు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టడానికి చంద్రబాబుకు సులభమైంది.

జూనియర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే మరో వైపు రాజకీయాల్లోకి వచ్చి పోతూ ఉన్నారు. హరీష్ రావు రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా సిద్ధిపేట నుంచి తిరుగులేని మెజారిటీతో గెలుస్తూ వస్తున్న నాయకుడు కూడా. దానికి తోడు. ఆయనకు మాస్ ఫాలోయింగ్ రాజకీయాల్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా సినిమాలకు సంబంధించిందే. అందువల్ల చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టడానికి ఉన్నంత వెసులుబాటు హరీష్ రావును పక్కన పెట్టడానికి కేసీఆర్ కు లేదు. 

అయితే, కేసీఆర్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆ వెసులుబాటును కల్పించాయి. టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యత సాధించడంతో కేసీఆర్ లో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. దాంతో హరీష్ రావును మంత్రి పదవికి దూరంగా పెట్టి, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి హరీష్ రావుకు ఇవ్వకపోవడం కూడా సరైందనే అభిప్రాయం కలిగించడానికి ఆ పని చేశారు. అదే సమయంలో హరీష్ రావు పాత్రను పార్టీలో కుదిస్తూ వచ్చారు. ఆయన కేవలం తన సిద్ధిపేట నియోజకవర్గానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు, లొల్లిని తట్టుకోలేక ఆయనకు మెదక్ లోకసభ ఎన్నికల బాధ్యతను అప్పగించారు.

కేటీఆర్ ను ముఖ్యమంత్రి సీటుపై కూర్చోబెట్టే వ్యూహంలో భాగంగా ఆయన జాతీయ రాజకీయాలను వ్యూహంగా ఎంచుకున్నారు. బిజెపి బలాన్ని కేసీఆర్ తక్కువ అంచనా వేశారనే చెప్పాలి. బిజెపికి లోకసభ ఎన్నికల్లో తగిన మెజారిటీ రాదని, అందువల్ల జగన్ తో కలిసి తాను కీలక పాత్ర పోషిస్తానని ఆయన అనుకున్నారు. అందులో భాగంగానే ఆయన మదిలో ఫెడరల్ ఫ్రంట్ అనేది పుట్టింది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయి, తన ఖాళీని కేటీఆర్ తో భర్తీ చేయాలని అనుకున్నారు. 

కేసీఆర్ ఆశలు గల్లంతయ్యాయి. బిజెపి తిరుగులేని మెజారిటీ సాధించడమే కాకుండా లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా దెబ్బ తిన్నది. బిజెపికి గానీ కాంగ్రెసుకు గానీ ఒక్క సీటు కూడా రాదని, తెలంగాణలో 16 లోకసభ స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని అంచనా వేసుకున్నారు. కానీ బిజెపి నాలుగు, కాంగ్రెసు మూడు స్థానాలు గెలుచుకుంది. దీంతో కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టింది. దాంతో కాస్తా వెనక్కి తగ్గినట్లు కేసీఆర్ కనిపించారు. కానీ, ఆలోచనలో మార్పు రాలేదు గానీ వ్యూహంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గాన్ని కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకున్నారు. కేటీఆర్ కు అనుకూలంగా ఉన్నవారిని, కేటీఆర్ కు సన్నిహితంగా ఉండేవారిని ఆయన ఎంచుకున్నారు. అయితే, ఈటల రాజేందర్ ఒక్కరే పానకంలో పుడకలా ఉన్నారు. ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తప్పిస్తే కేటీఆర్ కు మంత్రివర్గం పూర్తి అనుకూలంగా ఉంటుందనేది అందరూ అనుకునే విషయమే. 

కేటీఆర్ కు తొవ్వను సాఫీ చేసే క్రమంలో మంత్రివర్గ విస్తరణను కూడా ఎప్పటికప్పుడు కేసీఆర్ వాయిదా వేస్తూ వస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో మార్పులు చేర్పులు చేయాలనేది ఆయన ఆలోచన. ప్రధానంగా ఈటల రాజేందర్ ను తప్పించాల్సిన అవసరం ఆయనకు ఉంది. దీంతో తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 

ఈ క్రమంలోనే హరీష్ రావు, ఈటల రాజేందర్ తీవ్రమైన ఒత్తిడికి గురువుతున్నారని చెప్పవచ్చు. తాను అసంతృప్తికి గురవుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని, వస్తున్న వార్తలను హరీష్ రావు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. కానీ ఆయన మాత్రం అంత సంతృప్తిగా లేరనేది సన్నిహితులే చెబుతున్నారు. ఇటీవల సిద్ధిపేటలో జరిగిన ఓ సభలో జరిగిన విషయాన్ని అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. హరీష్ రావును విస్మరిస్తున్నారని నామినేటెడ్ పదవిలో ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తి సభలో బాహాటంగానే అన్నారు. అయితే, దానికి పెద్దగా ప్రచారం రాలేదు. అయితే, తన అసంతృప్తిని బయటకు వెల్లడించేందుకు హరీష్ రావు సిద్ధంగా లేరు. వేరే వ్యూహం ఏదైనా ఆయనకు ఉందా అంటే అది తెలియదు. 

ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారని ఇటీవల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలను రాజేందర్ ఖండించారు. కానీ, ఆయన మాత్రం ఒత్తిడిలో ఉన్నట్లు అర్తమవుతోంది. ఆ ఒత్తిడి కారణంగానే హుజూరాబాద్ సభలో గురువారంనాడు ఆయన వ్యాఖ్యలు చేశారని భావించవచ్చు. అయితే, ఆయన ఉద్దేశ్యపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేశారా, నాయకత్వం నాడిని పట్టుకోవడానికి చేశారా అనేది తెలియదు. కానీ, వెంటనే తాను చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వెంటనే ఓ ప్రకటన విడుదల చేశారు. 

హరీష్ రావు బయటకు మాట్లాడకపోయినా, ఈటల రాజేందర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నా కేసీఆర్ వైఖరిపై వారిద్దరికి ఏకీభావం ఉందని చెప్పడానికి లేదు. కేటీఆర్ ను తన స్థానంలోకి క్రమంగా తీసుకుని వచ్చే క్రమంలో హరీష్ రావును పక్కన పెట్టినట్లే, ఈటలను కూడా పెట్టాలనేది కేసీఆర్ ఆలోచన. ఆ ఆలోచన ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందనేది చెప్పలేం. కానీ, కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. 

- కాసుల ప్రతాపరెడ్డి

 

 

సంబంధిత వార్తలు

ఇప్పటికైతే మౌనంగానే ఉంటా, కేసీఆర్ ను కలవను: ఈటల రాజేందర్

జూ.ఎన్టీఆర్ పార్ట్ టైమ్, హరీష్ ఫుల్ టైమ్: కేసీఆర్ కు అల్లుడి పోటు

కేటీఆర్ ఫోన్‌తో ఈటల తుస్సుమన్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు

తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ

భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ

వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్

కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్

ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?

Follow Us:
Download App:
  • android
  • ios