దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే...

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ లో రెండు తీవ్రమైన మలుపులు ఉన్నాయి. ఈ మలుపులు భవిష్యత్తులో తీవ్రమైన ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. న్యాయం విచక్షణ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది.

Disha case accused encounter takes may take dangerous turn

నిర్భయ ఘటన జరిగిన ఈ డిసెంబర్ 16వ తేదీకి ఏడేళ్లవుతుంది. బహుశా, నిందితులకు ఉరిశిక్ష ఖాయమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంత క్రూరమైన ఘటనలో న్యాయం జరగడానికి ఏడేళ్లకు పైగానే పట్టింది. న్యాయ వ్యవస్థలోని ప్రక్రియ కారణంగా ఈ సమయం పట్టింది. 

నిర్భయ ఘటన జరిగినప్పుడు ప్రజలు వీధులకెక్కారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజల్లో ఆవేశాలు తారాస్థాయికి చేరడం సహజం. నేరస్థులను తక్షణమే చంపేయాలనే డిమాండ్ రావడం కూడా అంతే సహజం. ప్రజల ఆవేశాన్ని తగ్గించడానికి తక్షణ న్యాయం అందించడానికి సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బోబ్డే చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Disha case accused encounter takes may take dangerous turn

బోబ్డే పరోక్షంగానే అయినా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. తక్షణ న్యాయం సాధ్యం కాదని ఆయన చెప్పారు. హైదరాబాదులో జరిగిన దిశ అత్యాచార, హత్య ఘటన తీసుకున్న మలుపును దృష్టిలో పెట్టుకుని ఆయన పరోక్షంగా ఆ వ్యాఖ్యలు చేశారు. దిశ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాకుండా ఆ ఎన్ కౌంటర్ ను సమర్థిస్తున్న తీరును కూడా దృష్టిలో పెట్టుకుని, దానివల్ల భవిష్యత్తులో సంభవించబోయే ప్రమాదాన్ని పసిగట్టి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఎన్ కౌంటర్ అనే దానికి గతంలో ఓ అర్థం ఉండేది. ఎదురు కాల్పులు అని దాని అర్థం. ఎదురు పక్షానికి, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తాయి. ఈ స్థితిలో  నిందితులు వైపు మాత్రమే కాకుండా పోలీసుల వైపు గాయపడడం, మరణించడం వంటి సంఘటనలు జరగవచ్చు. నక్సలైట్ల ఎన్ కౌంటర్ నుంచి ఇతర ఎన్ కౌంటర్ల వరకు రెండు పక్షాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని అనుకోవడానికి కొంత వరకు వీలుండేది. 

సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అది కచ్చితంగా ఎదురు కాల్పుల సంఘటనే చెప్పారు. నిందితులు పోలీసులపై తిరగబడి, ఆయుధం లాక్కువడానికి ప్రయత్నించి, పారిపోవడానికి ప్రయత్నించారని, హెచ్చరికలు జారీ చేసినా వినలేదని, పోలీసులపై రాళ్లతో కూడా దాడులు చేశారని, దానివల్ల ఎన్ కౌంటర్ జరిగిందని. ఆ ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారని ఆయన వివరించారు. అది వరకైతే, ఎన్ కౌంటర్ కు ఆ అర్థం ఉండేది. కానీ, దిశ కేసులో నిందితుల కాల్చివేత తర్వాత ఎన్ కౌంటర్ అర్థం మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి.

Disha case accused encounter takes may take dangerous turn

సాధారణ ప్రజలే కాదు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతున్న మాటల్లోనూ ఎన్ కౌంటర్ అంటే, కాల్చేయడమనే అర్థం వ్యక్తమవుతుంది. ఆ విషయాన్ని వారు స్పష్టంగా చెప్పడం లేదు, కానీ వారి మాటలు దాన్నే ఉద్దేశిస్తున్నాయి. తాజాగా, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. రేపిస్టులను కాల్చేయడమే ఉంటుందని ఆయన అన్నారు. న్యాయ వ్యవస్థ కల్పించే వెసులుబాట్లు నిందితులకు ఉండవని ఆయన స్పష్టంగానే చెప్పారు. దిశ కేసు నిందితుల కాల్చివేత సంఘటన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కూడా అన్నారు. మరో మంత్రి పువ్వాడ అజయ్ కూడా దాదాపుగా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Also Read: ఇక కాల్చి పారేయడమే: రేపిస్టుసులకు తలసాని హెచ్చరిక

మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత రెండు ప్రమాదాలు పొంచి ఉన్నాయనేది. అది ఒకటి- జాతి యావత్తు విచక్షణ కోల్పోవడం, రెండోది - ఎన్ కౌంటర్ అనే పదానికి అర్థం మారిపోవడం. ఈ రెండు కూడా దేశానికి భవిష్యత్తులు తీవ్రమైన ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. 

దేశం యావత్తు విచక్షణ కోల్పోయిందని చెప్పడానికి సాధారణ ప్రజలు మాత్రమే కాదు, ప్రజా ప్రతినిధులు కూడా చేస్తున్న వ్యాఖ్యలు నిదర్శనం. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ విషయంలో తలెత్తుతున్న, తలెత్తాల్సిన సందేహాలను, ప్రశ్నలను వెనక్కి నెట్టేసింది. న్యాయవ్యవస్థను కూడా పోలీసు వ్యవస్థ తన చేతుల్లోకి తీసుకునే ప్రమాదకరమైన పరిస్థితి వల్ల అవి వెనక్కి వెళ్లాయి. 

దిశ కేసు నిందితులను ఎన్ కౌంటర్ సరైందే అని అనకపోతే నేరం చేసినట్లుగా మానియా చోటు చేసుకుంది. ఈ స్థితిలో మానవ, పౌర హక్కుల సంఘాల కార్యకర్తలను సంఘవ్యతిరేక శక్తులుగా జమ కట్టేందుకు ఇక ఎంత మాత్రమూ వెనకాడాల్సిన అవసరం లేని పరిస్థితిని కల్పించింది. అందుకే, ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ గానీ, తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటనలు గమనిస్తే మనకు పరిస్థితి అర్థమవుతుంది. ఆడపిల్లల తండ్రిగా తాము ఎన్ కౌంటర్ ను సమర్థిస్తున్నామని అంటూనే మరో సందేహాన్ని వారు వ్యక్తం చేశారు. హజీపూర్ ఘటనలో నిందితుడిని, అత్యాచార ఆరోపణలను ఎదుర్కుంటున్న నిత్యానంద స్వామిని కాల్చి చంపుతారా అని జగ్గారెడ్డి అడిగారు. జగ్గారెడ్డి మాటల్లో లోతుని అర్థం చేసుకోవడానికి బహుశా, ప్రస్తుత పరిస్థితిలో ఎవరూ సిద్ధంగా ఉండకపోవచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి.

Disha case accused encounter takes may take dangerous turnDisha case accused encounter takes may take dangerous turn

హజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని చంపేయాలని బాధితుల కటుంబాల సభ్యులు, గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. హజీపూర్ సంఘటనలు చిన్నవేమీ కావు. దిశ కేసుతో పోలిస్తే, సభ్య సమాజం తల దించుకునేవి, అత్యంత క్రూరమైనవి. ముగ్గురో, నలుగురో ఆడపిల్లలను రేప్ చేసి, హత్య చేసి, పాడు బడిన బావుల్లో పూడ్చిపెట్టారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి. అతను విచారణను ఎదుర్కుంటున్నాడు. ఇది తెలంగాణకు సంబంధించిన కేసే. 

Also Read: నిత్యానంద, శ్రీనివాస్ రెడ్డిల సంగతేంటి: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జగ్గారెడ్డి

మరో ఘటన కూడా ముందుకు వచ్చింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చెంచు మహిళ లక్ష్మిని రేప్ చేసి, హత్య చేశారు. ఈ ఘటనలో నిందితులను కాల్చిపారేయాలని స్థానిక ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఇతర బాధితుల కుటుంబాలు కూడా  దిశకు జరిగిన న్యాయమే తమకూ జరగాలని కోరుతున్నారు. అటువంటి కేసుల్లో వారం రోజుల్లోగా నిందితులను వారంలోగా ఉరితీయడమో, కాల్చేయడమో చేయాలని నిర్భయ తండ్రి అన్నాడు.

అత్యంత ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోవడానికి చాలా మంది సిద్ధంగా లేరు. దిశ కేసులో నిందితుడు చెన్నకేశవులు భార్య చేస్తున్న డిమాండ్. చెన్నకేశవులు భార్య డిమాండ్ ను సినీ నటి జీవిత తప్పు పట్టారు కూడా. కానీ, ఆమె అడుగుతున్న డిమాండులో అత్యంత కీలకమైన అంశం ఉందని గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. రేపిస్టులందరినీ కాల్చి పారేయండి, అప్పుడే తాను ఆందోళనను విరమిస్తానని చెన్నకేశవులు భార్య అంటోంది. 

Disha case accused encounter takes may take dangerous turn

రేప్ కేసులు ఎన్నో న్యాయస్థానాల్లో వివిధ దశల్లో ఉన్నాయి. వారందరినీ తీసుకుని వచ్చి పోలీసుల చేత ప్రభుత్వాలు కాల్చే పారేయించి న్యాయం చేయగలవా ్నేది ప్రశ్న. అది సాధ్యమయ్యే పని కాదు. ఇది భవిష్యత్తులో ప్రభుత్వాలకు తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ఎంత వరకు దారి తీస్తుందనేది ఆలోచించే పరిస్థితిలో ప్రజా ప్రతినిధులు కూడా లేరు. దిశ కేసులో మహిళా ప్రజాప్రతినిధులు పలువురు మాట్లాడిన తీరు చూస్తుంటే ఆ ప్రమాదం ఎంత బలీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది విచక్షణ కోల్పోయిన స్థితిని పట్టిస్తోంది. అదే సమయంలో న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా కల్పిస్తుంది. కాకపోతే, న్యాయవ్యవస్థలోని డొల్లతనాన్ని పట్టిచ్చేది కూడా కావచ్చు. 

Also Read: దేశంలో రేపిస్టులందరినీ ఎన్ కౌంటర్ చేసేవరకు నేను ఇక్కడినుంచి కదలను చెన్నకేశవులు భార్య

మరో ప్రధానమైన విషయం ఇక్కడ ముందుకు వస్తోంది. నటి ప్రత్యూష సంఘటన గానీ, అయేషా మీరా హత్య గానీ చిన్న విషయాలేమీ కావు. ప్రత్యూష కేసు ఏ దశలో ఉందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ప్రత్యూషను హత్య చేసినవారిలో రాజకీయ నాయకుల సంతానాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. పాలక వర్గాలు లేదా సంపన్న వర్గాలు లేదా అధికార వర్గాలు చేసే నేరాల విషయంలో దిశ కేసులో అనుసరించే పద్ధతినే అనుసరిస్తారా అనేది ప్రధానమైన ప్రశ్న. 

అయేషా మీరా కేసులో ఓ బడా రాజకీయ నాయకుడి మనవడిపై ఆరోపణలు వచ్చాయి. అయితే, సత్యం బాబు అనే యువకుడిని ఈ కేసులో నిందితుడిగా చేర్చి విచారణ జరిపించారు. చివరకు అత్యంత దయనీయమైన స్థితిలో సత్యంబాబు నిర్దోషిగా బయటకు వచ్చాడు. అయేషా మీరా కేసులో పోలీసులు దిశ కేసులో వ్యవహరించినట్లే వ్యవహరించి ఉంటే ఏమయ్యేది? ఒక నిర్దోషి కాలగర్భంలో కలిసిపోయేవాడు. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత అయేషా మీరా తల్లి వేసిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు? 

Disha case accused encounter takes may take dangerous turn

నేరం జరిగినప్పుడు ప్రజలు ఆవేశంతో ఊగిపోయినప్పుడు, దాన్ని చల్లార్చడానికి ప్రభుత్వాలు లేదా దాని ముఖ్య అంగమైన పోలీసు వ్యవస్థ భవిష్యత్తులో దిశ సంఘటన విషయంలో అనుసరించిన పద్ధితినే అనుసరిస్తే సంభవించే పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆలోచించాల్సి ఉంది. నిర్దోషులు బలయ్యే ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. పాలక, సంపన్న వర్గాల కుటుంబాలకు ఊరట కలిగించే పరిణామంగా అది పరివర్తన చెందే అవకాశం లేదా అనేది ఆలోచించాల్సి ఉంది. దోషులు తప్పించుకున్నా ఫరవా లేదు గానీ నిర్దోషికి శిక్ష పడకూడదనే ప్రాథమిక న్యాయ సూత్రం అర్థం కోల్పోయే ప్రమాదం ఉంది. 

దిశ కేసులో నిందితులకు పడిన తక్షణ శిక్షకు మనం ఆనందిస్తుండవచ్చు. మన ఆత్మలు సంతృప్తి చెందుతూ ఉండవచ్చు. కానీ, అదే పరిస్థితి మనకు ఎదురైతే ఎలా స్పందిస్తామనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నేరంలో పాల్గొనని వారు కూడా దిశ కేసులో నిందితుల పరిస్థితిని కూడా భవిష్యత్తులో ఎదుర్కునే ప్రమాదం లేదా అనేది ప్రశ్నించుకోవాలి. 

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. న్యాయమనేది ప్రతీకార రూపం తీసుకోకూడదని ఆయన అన్నారు. అది ప్రతీకార రూపం తీసుకుంటే సంభవించే పరిణామాన్ని కూడా ఆయన సూచించారు. న్యాయం చేయడంలో కొన్ని లొసుగులు ఉన్న మాట వాస్తవమేనని, వాటిని సరిదిద్దాలని కూడా ఆయన అన్నారు. 

Also Read: దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

సామాజిక హోదా, పలుకుబడి నేరస్థులను బయటపడేసే పరిస్థితి మాత్రమే కాకుండా నిర్దోషులకు శిక్షలు పడే అతి పెద్ద ప్రమాదాన్ని దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ కల్పిస్తోంది. అన్ని సామాజిక వర్గాలకు ఇదే న్యాయం అమలు చేస్తారా అనే ప్రశ్న ఇక్కడ అత్యంత ప్రధానమైంది కూడా. 

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత కూడా అత్యాచార ఘటనలు ఆగలేదు. ఈ రెండు మూడు రోజుల్లోనే అత్యంత కిరాతకమైన అత్యాచార, హత్య ఘటనలు చోటు చేసుకున్నాయి. అందువల్ల భయపెట్టడం ద్వారా సమాజాన్ని మార్చలేమని గుర్తుంచుకోవాలి. 

- కె. నిశాంత్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios