హైదరాబాద్: పశు వైద్యురాలు దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమర్థించారు. క్రూరమైన నేరం చేస్తే పోలీసు ఎన్ కౌంటర్ లో చచ్చిపోతారని ఆయన అన్నారు. ఇది గుణపాఠం, నువ్వు తప్పు చేస్తే కోర్టు విచారణ, జైలు శిక్ష, లేదంటే బెయిల్ వంటి ప్రయోజనాలు పొందలేవని, అటువంటి ప్రక్రియ ఏదీ ఇక ఉండదని ఆయన అన్నారు. 

ఎవరైనా తప్పు చేస్తే, క్రూరంగా వ్యవహరిస్తే ఎన్ కౌంటర్ జరుగుతుందనే సంకేతాలను దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ద్వారా పంపించామని తలసాని అన్నారు. ఓ స్థానిక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు. తాము స్పష్టమైన సంకేతాలు ఇచ్చామని, ఇది దేశానికి ఆదర్శం అవుతుందని తలసాని దిశ కేసు నిందుతుల ఎన్ కౌంటర్ ను సమర్థిస్తూ అన్నారు. 

సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనే కాకుండా శాంతిభద్రతలను పరిరక్షించడంలో కూడా దేశానికి ఆద్రశంగా నిలుస్తున్నామని ఆయన చెప్పారు. 

స్పీడీ జస్టిస్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని మరో మంత్రి అజయ్ కుమార్ అన్నారు. మన కూతుళ్లపై ఎవరైనా చెడు చూపు చూస్తే వారి కళ్లు పీకి పారేయాలని ఆయన అన్నారు. ఎన్ కౌంటర్ దిశ కుటుంబ సభ్యులకు శాంతిని చేకూర్చుస్తుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.