కేంద్ర బడ్జెట్ ని నిరసిస్తూ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. గురవారం పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ ప్రకటించకపోవడంపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ రాష్ట్రానికి బడ్జెట్ లో తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తూ.. వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. విశాఖలోని అశీల్ మెట్ జంక్షన్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

విశాఖలోనే కాకుండా కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ నేతలు ఆందోళనలు తీవ్రతరం చేశారు. వైసీపీ నేతల ఆందోళనతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎంపీలు.. కేంద్రం కాళ్లు పట్టుకొనైనా సరే విశాఖకు రైల్వే జోన్ తీసుకురావాలని.. లేదంటే పీకలు పట్టుకుంటామంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ బాటలోనే వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నడుస్తున్నాయి. వీరు కూడా పలు ప్రాంతాల్లో ఆందోళనలు మొదలుపెట్టారు.