కడపలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగన్ పులివెందులకు బయలు దేరిన జగన్
వైసీపీ అధ్యక్షుడు జగన్.. ఆదివారం పులివెందలలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికారు. కడప చేరుకున్న వెంటనే ఆయన అక్కడి సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గండి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో పులింవెందుల బయలు దేరారు.
సోమవారం మధ్యాహ్నం జగన్ ప్రజా సంకల్పయాత్ర మొదలౌతున్న సంగతి తెలిసిందే. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. మొదట కడప జిల్లాలో ఏడు రోజులపాటు 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మీదుగా యాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. తర్వాత అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల మీదుగా ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది.
