తమ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలను కొన్నట్టు చంద్రబాబు కొన్నాడని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. బహుషా.. తమ పార్టీ గుర్తుతో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబుకి గొర్రెల్లా కనిపించి ఉంటారు.. అందుకే అధికంగా బేరసారాలు చేసి మరీ తమ పార్టీలోకి మార్చుకున్నారని జగన్ ఆరోపించారు. సోమవారం ఉదయం ఆయన ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు అంతటి మోసగాడు దేశ చరిత్రలోనే ఎక్కడా ఉండడని జగన్ విమర్శించారు. దమ్ముంటే తన పార్టీ గుర్తుతో గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప  ఎన్నిక పెట్టాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నిక పెడితే గెలవమనే భయం టీడీపీ నేతలో ఉందని.. అందుకే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించరని ఎద్దేవా చేశారు. మంత్రి వర్గం ప్రతిపక్ష పార్టీ నేతలు ఉండటం.. దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు.  అసలు మంత్రి వర్గంలో ఏ పార్టీ వాళ్లు ఉన్నారో కూడా అర్థం కాకుండా ఉందని ఎద్దేవా చేశారు. నంద్యాల ఎన్నికల్లో గెలిచేందుకు రూ.200కోట్లు ఖర్చు చేశారన్నారు.

 

ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వంలోని పెద్దలతో పోరాటం చేస్తున్నానని, రాజకీయాలలో చేయని పోరాటం లేదని గుర్తుచేసుకున్నారు. తాను నడిచిన నా ప్రతి అడుగులోనూ ప్రజలందరూ అండగా నిలబడ్డారు కాబట్టే చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. తనకు తోడుగా నిలిచిన రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని మరిచిపోనని, వారి రుణాన్ని తీర్చుకోలేనని అన్నారు.