తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి ఆలయంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి. భక్తుల కొంగు బంగారం చేసే ఆలయంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వామి వారి దర్శనభాగ్యం ప్రజలకు లభించడం లేదు. అందుకు మరి కొంత కాలం ఆగాల్సిందే నని అధికారులు చెబుతున్నారు.
యాదగిరి గుట్ట నరసింహ స్వామి ప్రధాన ఆలయ పనులను వేగ వంతం చేశారు. అయితే భక్తులు స్వామివారిన దర్శించుకునేందుక మరి కొంత కాలం ఆగాల్సిందేనని ఆలయ అధికారులు చెబుతున్నారు. స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధాన ఆలయాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. యాదగిరి గుట్టను మరో తిరుపతి చేయాలని.. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ అభివృద్ధి చర్యలు చేపట్టింది.
వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో యాదాద్రి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అదేవిధంగా మే నెలలో నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు కూడా ఉన్నాయి. ఈ రెండు సందర్భాలలో ఏదో ఒక రోజున ప్రధాన ఆలయాన్ని ప్రజల దర్శనార్థం తెరిచే అవకాశం ఉందని యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ ( వైటీడీఏ)తెలియజేసింది.
ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణానికి దాదాపు రూ.1800 కోట్ల వ్యయం అవసరమని వైటీడీఏ సీఈవో కృష్ణారావు చెప్పారు. కాగా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేయగా.. మరో రూ.500 కోట్లు త్వరలోనో మంజూరు చేయనున్నదని ఆయన తెలిపారు.
స్వామి వారి ఆలయాన్ని కృష్ణ శిలతో నిర్మాణం చేపడుతున్నారు.
గతంలో భక్తులకు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయడానికి కూడా కుదిరేది కాదు. ఈ నూతన నిర్మాణం తర్వాత ఆ వెసులు బాటు ఉంటుందని.. 2.7కిలోమీటర్ల విస్తీర్ణంతో గిరి ప్రదక్షిణ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
