ప్రేమించి.. పెళ్లికి నిరాకరించిందని.. అబ్బాయిలు.. అమ్మాయిలను చంపడం, ముఖంపై యాసిడ్ పోయడం లాంటి ఘటనలు చూసే ఉంటారు. ఇలాంటి సంఘటనే ఒకటి పూణెలో జరిగింది. కాకపోతే.. ఇక్కడ మహిళ.. తన ప్రియుడ్ని హతమార్చింది. చివరికి పోలీసులకు దొరికిపోయి..కోర్టు శిక్ష అనుభవిస్తోంది.

అసలు విషయం ఏమిటంటే.. పూణే నగరానికి చెందిన సరిత (28) అనే మహిళ భర్తని కోల్పోయింది. దీంతో కూతురితో కలిసి జీవనం సాగిస్తోంది. శివాజీనగర్ రైల్వేస్టేషను వద్ద వడపావ్ స్టాల్ నిర్వహిస్తున్న హనుమంతుతో సరితకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. కాగా.. హనమంతుకి అప్పటికే వివాహమై భార్య పిల్లలున్నారు.

కొద్ది రోజుల నుంచి తనను రెండో పెళ్లి చేసుకోవాలని సరిత హనుమంతుని కోరింది. కాగా.. అందుకు అతను నిరాకరించాడు. దీంతో.. హనుమంతుపై సరిత కక్ష పెంచుకుంది. తనతో సహజీవనం చేస్తూ.. వివాహానికి మాత్రం నిరాకరించడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో పథకం ప్రకారం ఒక ప్రాంతానికి ఫోన్ చేసి రప్పించింది.  తనతోపాటు మరో ఇద్దరు వ్యక్తులను తీసుకువచ్చి..వారి సహాయంతో హనుమంతుని దారుణంగా హత్య చేసింది. 

మొదట ఈ కేసును అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేసుకున్నారు. అయితే.. అతని ఫోన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా.. సరితే హంతకురాలన్న విషయం తేలింది. హత్యకు ముందు రోజు సరిత.. హనుమంతుకి చేసిన ఎస్ఎంఎస్ ల ద్వారా పోలీసులు కేసు చేధించారు. తనను పెళ్లిచేసుకోకపోతే చంపేస్తానని సరిత .. హనుమంతుకి మెసేజులు పంపిందని పోలీసులు తెలిపారు. సరితను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. ఆమెకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు పోలీసులు తీర్పు వెలువరించారు.