మూడు వరస పరాజయాల చరిత్ర ఉన్న తెరా చిన్నప రెడ్డి నల్గొండ లోక్ సభ సీటుకు టిఆర్ ఎస్ అభ్యర్థి అవుతారా?

తేరా చిన్నపరెడ్డి గుర్తున్నారా?

చాలా కాలంగా ఆయన అంతగా వార్తల్లో లేరు. అయితే, ఇపుడు సడన్ గా ఆయన పేరు గాలిలో తేలుతూ ఉంది. కారణం, ఆయన నాలుగో సారి ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారట. అదే , నల్గొండ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక వస్తే టిఆర్ ఎస్ తరఫున పోటీచేసేందుకు ఆయన ఉవ్విళ్లూరు తున్నట్లు నల్గొండ జిల్లాలోనే కాదు, హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా వినబడుతూ ఉంది.

ఆయన ఇండస్ట్రియలిస్టు. శ్రీని ఫార్మష్యూటికల్స్ ప్రమోటర్. ఆ మధ్య ఆయనకు రాజకీయాల మీద గాలిమల్లింది. అంతే,2009 ఎన్నికల ముందు ఆయన టిడిపిలో చేరారు. బాగా డబ్బు దస్కం ఉంది కాబట్టి ఈ ఎక్కడయినా , ఎవరికైనా ధీటైన ప్రత్యర్థి అని తెలుగుదేశం పార్టీ భావించింది. 2009 ఎన్నికల్లో ఆయన్ని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనయర్ జానారెడ్డి మీద పోటీ పెట్టింది. మాంచి ఫైటే ఇచ్చారు, కేవలం ఆరు వేల వోట్ల తేడాతో జానారెడ్డి చేతిలో వోడిపోయారు.అయినా ఆయన ఓటమికి జంకలేదు. 2014లో తన లక్ పరీక్షించుకునేందుకు సన్నద్ధమయ్యారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం మీద దృష్టి కేంద్రీకరించారు. బాగా తిరిగారు.పార్టీ క్యాడర్ ను ఉత్తేజ పరిచారు. పార్టీని జండా నిలబెట్టారు. తీరా 2014 ఎన్నికలపుడు తెలుగుదేశం పార్టీ ఆయన్ని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ పెట్టింది. అక్కడా ఆయన వోడిపోయారు. అపుడు కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి చేతి చిత్తు చిత్తుగా ఓడిపోయారు. కాంగ్రెస్ కు ఆయనకు తేడా దాదాపు రెండు లక్షల పైనే. రెండోసారి పరాజయం తర్వాత ‘మనకు తెలుగుదేశం పార్టీ అచ్చిరాలేదు’ అనే నిర్ణయానికి వచ్చారు. ఈ లోపు రాష్ట్ర విభజన జరిగింది. సుఖేందర్ రెడ్డి లాగానే ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్ ) లో చేరారు. అప్పటికీ ఆయనలో ఉన్న ఎన్నికల పోరాట స్ఫూర్తి చావ లేదు. నల్గొండ- వరంగల్- ఖమ్మమ్ గ్రాజుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడాలనుకున్నారు. అయితే, టి ఆర్ ఎస్ ఆయనను కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డిని నిలబెట్టింది. టిఆర్ ఎస్ గెల్చింది. తేరా నిలబడి ఉంటే తప్పక గెలిచేవారు. ఓడిపోయే చోట ఆయన టికెటొచ్చింది. గెల్చే అవకాశాలున్నపుడు తీరా టికెట్ రాలేదు. అయితే, మూడో సారి పోటీ చేసే అవకాశం ఆయనకు లోకల్ అధారిటీస్ నియోజకవర్గంనుంచి పోటీ రూపంల లభించింది. అయితే 2015లో జరిగిన ఆ ఎన్నికల్లో కూడా ఆయన పరాజయం పాలయ్యారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ ఖాళీ చేయడం ఖాయమని, అక్కడ ఉప ఎన్నిక జరిపించి టిఆర్ ఎస్ ను అఖండ విజయంతో గెలిపించి తెలంగాణ జనమంతా పింక్ పార్టీతోనే ఉన్నారని చెప్పేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధమవుతున్నారని మీడియాలో వస్తున్నది. సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తారనేందుకు ఒక చిన్న రుజువు చూపిస్తున్నారు. ఆయన చిట్యాల మండలంలోని ఉరుమడ్ల రైతుసమన్వయ సమితిలో మెంబరయ్యారు. ఆ తర్వాత ఆయనను చిట్యాల మండల రైతు సమితి సభ్యునిగా నామినేట్ చేశారు. సాధారణంతా ఇదంతా లోకల్ గా ఉండే చిన్న చిన్న రైతుల కోసం కేటాయించేవి. అయినా సరే గుత్తా ను నామినేట్ చేశారు. కారణం, తర్వాత ఆయనను జిల్లా సమితికి ఆపైన రాష్ట్ర సమితి నామినేట్ చేసిన ఛెయిర్మన్ ను చేస్తారని దానికి క్యాబినెట్ ర్యాంకు ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అందువల్ల ఎన్నికలు గ్యారంటీ అంటున్నారు. అయితే, మరి టిఆర్ ఎస్ అధినేత అభ్యర్థిగా తేరాను నిలబెడతారా?

తేరా దగ్గిర బాగా డబ్బున్నమాట నిజమే. ఇక్కడ ఆయనకు ఫుల్ మార్కులు పడతాయి. అయితే కెసిఆర్ కు మరొక క్వాలిఫికేషన్ చూస్తారు.అది గ్రహబలం. పోటీచేసిన ప్రతి ఎన్నికల ఓడిపోయిన తేరా చిన్నప రెడ్డి గ్రహబలం బాగా లేదని వాదించే అవకాశం ఉంది. అలాంటపుడు ఇంత కీలమయిన ఎన్నికకు ఆయన్ని నామినేట్ చేస్తారా అనేది ప్రశ్న.

మొత్తానికి ఈ ఎన్నిక కూడా చేజారిపోతుందా... లేద ఆయన గ్రహబలాన్ని మార్చేస్తుందా...