Asianet News TeluguAsianet News Telugu

యూపిలో మళ్ళీ బీహార్ ఫలితమేనా

కులాల పరంగా చూస్తే యూపిలో కూడా బీహార్ తరహా సమీకరణలే ఎక్కువ.

will Bihar results repeat in UP

త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాషాయంపార్టీకి బీహార్ తరహా అనుభవం తప్పేట్లు లేదు. మూడు పార్టీలనేతల ఆధ్వర్యంలో ఏర్పడిన లౌకికమహాకూటమి బలంగా కనబడుతోంది. దాంతో భారతీయ జనతా పార్టీ బాగా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చొరవతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధి, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి) అజిత్ సింగ్ కలిసి కూటమిగా ఏర్పడ్డారు.

 

మొన్నటి వరకూ ములాయంసింగ్ యాదవ్ కుటుంబంలో తలెత్తిన సంక్షోభంతో ఎన్నికల్లో విజయం తమదే అని భాజపా నేతలు సంభరపడ్డారు. అయితే, అఖిలేష్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఓట్లు చీలకుండా ‘లౌకికమహాకూటమి’ని ఏర్పాటు చేయటంతో భాజపా ఖంగుతిన్నది. దానికితోడు ఇటీవల వెలువడిన సర్వేలన్నీ ఎస్పి, భాజపా, బిఎస్పీ, కాంగ్రెస్,ఆర్ఎల్డీ తదితర పార్టీల పరిస్ధితిపై ప్రజాభిప్రాయం సేకరించాయి. అయితే, ఇపుడు ఏర్పడిన మహాకూటమితో గతంలో చేసిన సర్వేలన్నీ తారుమారయ్యే అవకాశాలున్నాయి.

 

కులాల పరంగా చూస్తే యూపిలో కూడా బీహార్ తరహా సమీకరణలే ఎక్కువ. పార్లమెంట్ ఎన్నికల్లో హవా చూపించిన భాజపాకు అటువంటి ఫలితాలు వచ్చేది అనుమానమే. కేంద్రంలో అధికారంలో ఉన్న జోష్ కూడా ఆ పార్టీలో కనబడటం లేదు. దాంతో పార్టీ యంత్రాంగంలో నిస్తేజం చోటు చేసుకున్నది. ఇటువంటి పరిస్ధితిల్లో పెద్ద నోట్ల రద్దు ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లైం’ది. దాంతో భాజపా నేతలు ప్రచారం చేయాలంటేనే ఇబ్బందిపడుతున్నారు. అయితే ఆ విషయం బయటపడకుండా వెంకయ్యనాయుడు లాంటి వాళ్లు మహాకూటమిని ఎగతాళి చేస్తున్నారు.

 

దానికితోడు యూపిలోని రాయబరేలి, అమేథి తదదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. జాట్లలో ఆర్ఎల్డీకి బాగా పట్టుంది. ఇక, ముస్లింలు, యాదవుల్లో ఎస్పీకి తిరుగులేదు. ఈ విధంగా మూడు పార్టీలు కలవటంతో క్షేత్రస్ధాయిలో బలంగా కనిపిస్తోంది. ఇంకోవైపు భాజపాలో నీరసం స్పంష్టగా తెలుస్తోంది. బ్రాహ్మణలు, ఎస్సీ తదితర వర్గాల ఓట్ల కోసం భాజపా, బిఎస్పీతో పాటు కాంగ్రెస్ కూడా వాటా కోరుకుంటోంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు చీలిపోతే తాము లాభపడతామని భాజపా భావించింది. అయితే, ఇపుడు దాదాపు త్రిముఖ పోటీనే జరుగనుంది.

 

ఇటువంటి పరిస్ధితుల్లో కమలంపార్టీ ఎంతవరకూ నెగ్గుకొస్తుందో అనుమానమే. భాజపా ప్రధానంగా మోడిపైనే ఆశలు పెట్టుకున్నది. అయితే, నరేంద్రమోడి బహిరంగ సభల సంఖ్య కూడా తక్కువగా ఉండటం భాజపాను కలవరపరుస్తోంది. అయితే, రేపు టిక్కెట్లు ఖరారు చేసిన తర్వాత ఆయా పార్టీల్లోని తిరుగుబాట్ల మీద కూడా అభ్యర్ధుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. తిరుగుబాట్లన్నది అన్నీ పార్టీలకూ తప్పేట్లు లేదు. దాంతో అందరూ ఆ ఘట్టం కోసమే ఎదురుచూస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios