టిడిపి పార్టీని అధికారం నుండి కూలదోయాలని రాష్ట్రంలో మహా కుట్ర జరుతోందని విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్రావు ఆరోపించారు. టిడిపి ని విమర్శించడానికే బిజెపి పవనన్ కళ్యాణ్ ను అస్త్రంగా వాడుకుంటోందని, ఈ విషయం పవన్ గుర్తించాలన్నారు. ట్వీట్లు, తిట్ల ద్వారా రాజకీయాలు చేయలేమని, ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై పోరాడాలని సూచించారు. టిడిపి పార్టీపై, మంత్రి లోకేష్ పై పవన్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఒకరిపై నిందలు వేసేటపుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ పవన్, జగన్ ల వల్ల ప్రత్యేక హోదా రాదని, ఈ హోదా సాధించే దమ్ము సీఎం చంద్రబాబుకు మాత్రమే ఉందని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంపై, టిడిపి పార్టీపై రాష్ట్రంలో మహా కుట్ర జరుగుతోందని బోండా ఉమ ఆరోపించారు. ఈ కుట్రలు ఎవరు చేయిస్తున్నారో తాము గుర్తించామని, అయినా వీరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజల అండ మాకే ఉంటుందని స్పష్టం చేశారు. హోదా హామీ ఇచ్చి మోసం చేసిన బిజెపి జనసేన, వైసిపి తో కలిసి ఈ కుట్రలు పన్నుతోందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా టిడిపిపై అసత్యప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

ఈ జనసేన, వైసిపి పార్టీలు ఒక్కసారైనా ప్రధానిని ప్రత్యేక హోదా గురించి నిలదీశాయా? అని ఉమ ప్రశ్నించారు. ఎపిలో ఉనికిని కోల్పోతున్న బిజెపి జనసేన, వైసిపితో లోపాయికారి ఒప్పందం చేసుకుని నీచ రాజకీయాలు చేస్తోందన్నారు. ఇలా లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడం తెలుగుదేశం పార్టీకి చేతకాదని స్పష్టం చేశారు. ఈ వంచన రాజకీయాలకు, లోపాయికారి ఒప్పందాలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

 హోదాకోసం సీఎం చంద్రబాబుతో పాటు 13 జిల్లాల్లో తమ పార్టీ నాయకులు  ధర్మ పోరాట దీక్ష చేసి కేంద్రానికి గట్టి సంకేతాలు పంపాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో డిల్లీని ఇంకా గట్టిగా ఢీ కొంటామని హెచ్చరించారు. తమపై వైసిపి అధినేత జగన్ లా కేసులు లేవని అందువల్లే ప్రధానికి భయపడమన్నారు. ఇలా ఉన్నవారు మోదీకి భయపడతాని జగన్ ను విమర్శించారు.దేశంలో ఉన్న 29 మంది సీఎంలలో చంద్రబాబు ఒక్కరే ఇంత గట్టిగా డిల్లీమీద పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటం లో ఆయన సక్సెస్ అవుతాడన్న ఆశాభావం తెలుగు ప్రజల్లో ఉందని బోండా ఉమ తెలిపారు.