భర్తతో తాను కలిసి వుండలేనన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే తన భర్తకు తాను తలాక్ చెబుతున్నట్లు పేర్కొన్నారు.
ముస్లిం వివాహ వ్యవస్ధలో వివాదాస్పదమైన తలాక్ పై ఒకవైపు సుప్రింకోర్టు విచారణ జరుపుతుండగానే ఒక బాధితురాలు తన భర్తకు విడాకులివ్వటం అదికూడా తలాక్ పద్దతిలో సంచలనంగా మారింది. ముస్లిం సమాజంలో భర్తలు భార్యలకు తలాక్ పద్దతిలో విడాకులు ఇవ్వటమే ఇందతవరకూ చూసాం. అటువంటిది రివర్స్ లో ఒక భార్య తన భర్తకు తలాక్ చెప్పటం ద్వారా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలికి చెందిన ఓ మహిళకు వివాహమై ఆరేళ్ళవుతోంది. ఈమధ్య తన కూతురితో సహా పుట్టింటికి వచ్చింది. ఎన్ని రోజులైనా తన భర్త తమను తీసుకెళ్ళటానికి రాకపోవటంతో విసిగిపోయిన ఆమె తన భర్తకు తలాక్ చెప్పేసింది. తన పుట్టింటికి వచ్చి భర్త చూడకపోవటంతో తనకు ఆగ్రహం వచ్చిందన్నారు. అంతేకాకుండా తన భర్త తనను చాలాకాలంగా అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు.
కూతురు పుట్టిన దగ్గర నుండి వేధింపులు మరీ ఎక్కువైపోయిందట. డబ్బు కోసం తన కూతురుని తన భర్త తరపు వారే కిడ్నాప్ కూడా చేసినట్లు తెలిపారు. భర్తతో తాను కలిసి వుండలేనన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే తన భర్తకు తాను తలాక్ చెబుతున్నట్లు పేర్కొన్నారు. భరణం కోసం భర్త నుండి ప్రతీ నెల కొంత సొమ్ము కావాలంటూ కోర్టును ఆశ్రయించనున్నారు. భార్యను, కుటుంబాన్ని పట్టించుకోని భర్త నుండి విడాకులు కోరటం సబేనంటూ అక్కడి మతపెద్దలు కూడా బాధితులరాలికి మద్దతుగా నిలవడం గమనార్హం.
