జగన్ పాదయాత్రకు ముందే వైసీపీకి మరో షాక్ తగలనుందా? మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే..అవుననే సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోమవారం నుంచి మహా సంకల్ప యాత్ర చేయనున్న సంగతి తెలిసిందే.  ఆయన పాదయాత్రకి పోలీసులు కూడా అనుమతి ఇవ్వడంతో.. ఆ పార్టీ నేతలు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు.

అయితే.. ఈ ఆనందం వారిలో ఎక్కువ సేపు నిలవదేమోననే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి.. వైసీపీ ని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆమె బాటలోనే మరో ఇద్దరు ఎమ్మల్యేలు.. సైకిల్ ఎక్కబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీకి ఐదుగురు ఎమ్మల్యేలు ఉండగా.. జ్యోతుల నెహ్రు, వరపుల సుబ్బారావులు టీడీపీలోకి దూకేసారు. వారి వెంటే రాజేశ్వరి కూడా వెళ్తుందని అంతా భావించారు. అయితే.. ఆమె కొంత సమయం తీసుకొని శనివారం ఆ పార్టీలోకి జంప్ చేసింది.

ఇక మిగిలింది తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. వీరిద్దరూ కూడా పార్టీ ఫిరాయింపులకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ శ్రేణులతో సంప్రదింపులు మొదలు పెట్టారని.. రేపో, మాపో చేరిపోతారని ప్రచారం ఊపందుకుంది. ఇదే నిజమైతే.. వైసీపీకి మరో షాక్ తగిలినట్టే.