ప్రముఖ మోటారు వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ తొలిసారిగా 125సీసీ స్కూటర్ విభాగంలోకి అడుగుపెడుతోంది. ఈ విషయాన్ని టీవీఎస్ అధికారికంగా ప్రకటించింది.ఈ విభాగంలో తొలి స్కూటర్‌ ఎన్‌టార్క్‌ ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. దీని ధర రూ.58,750 (ఎక్స్‌షోరూం, దిల్లీ)గా ప్రకటించింది. ఇప్పటికే స్కూటరెట్‌ స్కూటీ పెప్‌తో పాటు టీవీఎస్‌ జూపిటర్‌, వెగో స్కూటర్లను సంస్థ విక్రయిస్తున్న సంగతి విదితమే. 18-24 ఏళ్ల యువతను దృష్టిలో పెట్టుకుని కొత్త స్కూటర్‌ను ఆవిష్కరించినట్లు టీవీఎస్‌ మోటార్‌ అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) కె.ఎన్‌.రాధాకృష్ణన్‌ తెలిపారు. ఒక వారంలో దేశవ్యాప్తంగా ఈ వాహనం అందుబాటులోకి వస్తుందని, తొలి ఏడాదిలోనే 2 లక్షల వాహనాలు విక్రయించాలనేది సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.