దేశీయ ఉద్యోగాల పెరగక ముందే ఇండియాలో ఐటి ఉద్యోగాలు టప టప రాలిపోతున్నాయి. ఇది రాబోయే పెను సంక్షోభానికి సూచనగా చెప్పుకోవచ్చు.

 

దేశంలో ఉద్యోగాల కోసం ఐటి దిగ్గజం అని పేరున్న విప్రోతోనే మొదలయింది. మార్చిలో విప్రో 600 మంది ఉద్యోగులను పెరికేసింది.

 

ఇపుడందుతున్న సమాచారం ప్రకారం దేశంలో ఏడు పెద్ద ఐటికంపెనీలు సుమారు 56 వేల మంది ఉద్యోగుల ఉద్వాసనకు పూనుకున్నాయి.  వీళ్లంతా తొందర్లో విడతల వారిగా ఈ కంపెనీలను వదిలేస్తారు. సగటున ఒక్కొక్క కంపెనీ ఎనిమిది వేల ఉద్యోగులను తీసేస్తున్నదన్నమాట. ఉద్యోగ ఉద్వాసన చెప్పిన కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహింద్ర, హెచ్ సిఎల్, కాగ్నైజాంట్, డిఎక్స్ సి, కాప్ జెమిని సిఎ. ఈ  ఏడుకంపెనీలకు దేశంలో మొత్తంగా 10.24 లక్షల ఉద్యోగులున్నారు. 2017 నాటికి కనీసం 4.5 శాతం ఉద్యోగాలను తీసేయాలన్నది ఈ కంపెనీల ప్లాన్ అట. 

 

గత ఏడాది పోయిన ఉద్యోగాల కంటే ఇది రెట్టింపంటున్నారు.  నిజానికి ఈ కంపెనీలు, పైకి చెబుతున్నదాని కంటే ఇంకా  పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. చాలా మందికి ఇప్పటికే సూచన ప్రాయంగా ఈ సమాచారం చేరవేశాయి. కాగ్నైజాంట్ హిట్ లిస్టులో 15 వేల మంది ఉన్నారు. సామర్థ్యం మెరుగు పర్చుకోమని ఇన్ఫోసిస్ కనీసం మరొక మూడువేల మంది చెప్పిందట. అంటే, మీరు మాకు పనికిరారనే గా అర్థం.

 

మరొకవైపు ఇన్ఫోసిస్ ఇంకొక పరిణామం జరిగింది. ఈ సంస్థ సాధారణంగా ఏప్రిల్ లో జీతాలు పెంచుతుంది. ఈ సారి ఏప్రిల్ పెంచలేమని, ఉద్యోగులు జూలై నెల దాకా ఆగాలని తెలిపింది.  ఈ మేరకు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికి మెయిల్ వెళ్లింది.  జీతాలపెంపు సీనియర్ ఎగ్జి క్యూటివ్ లకు ఇంకా ఆలస్యమవుతుందని కంపెనీ తెలిపింది.   జాబ్ లెవెల్ 5  నుంచి కింది స్థాయి ఉద్యోగాలన్నింటికి జీతాల పెంపు జూలైలో ఉంటుందని  ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్  యు బి ప్రవీణ్ రావు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పనితీరు చాలా చాలెంజింగ్ ఉండిందని, ఇదంతా దాని పర్యవసానమేనని ఆయన ఈ మెయిల్ పేర్కొన్నారు.