ఇందిరాగాంధీ వదులుకున్న మూడు గుర్తులు ఇంకా కాంగ్రెస్ ను పీడిస్తూనే ఉన్నాయి

ఇందిరాగాంధీ వదిలేసిన సైకిల్ కథ ఇది.

ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అఖిలేశ్ సైకిల్ వెంట బడుతూ ఉంది.

ఆంధప్రదేశ్ లో సైకిల్ స్పీడ్ ను అపలేక కాంగ్రెస్ చతికిల పడింది. వొల్లంతా గాయాలయి రొప్పుతూ ఉంది.

అయితే, ఒకపుడు ఇదే సైకిల్ ఇందిరా గాంధీ తనకు పనిరాదని వదిలేసింది.

అమె పనికిరావనివదిలేసిన మూడు ఎన్నికల గుర్తులు ఇపుడు కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి.

చాలా మందికి తెలియదు, ఒకపుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుర్తు కరువయింది. ఎన్నికల కమిషన్ మూడు గుర్తులు చూపి ఏదికావాలో కోరుకోమంది.ఈ పరిస్థితి ఎపుడెదురయిందటే...1978 లో... ఎమర్జీన్సీ ఎత్తేశాక. పార్టీ చీలిపోవడంతో ఆమె కొత్త గుర్తు తీసుకోవాలనుకున్నారు.

అప్పటిదాకా ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి అవుదూడ గుర్తుండేది. ఎమర్జన్సీ తర్వాత ఈ అవు అంటే ఇందిరాగాంధీ, దూడ అంటే సంజయ్ గాంధీ అని అంతా ఎగతాళి చేస్తూ ఉండటంతో ఏమయినా సరే ఈ గుర్తును వదిలించుకోవాలని ఆమె భావించారు.

ఒక మంచి గుర్తు ఎంపిక చేయమని అప్పటి కాంగ్రెస్ నాయకుడు బూటా సింగ్ కు చెప్పారు.

బూటా సింగ్ గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేశారు.

తర్వాత ఒక రోజూ ఎన్నికల కమిషన్ మూడు గుర్తులు- ఎనుగు, సైకిల్, హస్తం-చూపించి ఒకటి ఎంపిక చేసుకోవాలని బూటా సింగ్ కు వర్తమానం పంపింది. ఆరోజు ఇందిరాగాంధీ విజయవాడ లో ఉన్నారు. అమె ఆమోదం తీసుకున్నాక ఎన్నికల కమిషన్ అంగీకారం తెలపాలి.

వెంటనే బూటా సింగ్ విజయవాడకు ట్రంక్ కాల్ బుక్ చేశారు. గుర్తుల గురించి వివరించాలనుకున్నారు. అయితే లైన్ క్లియర్ గా లేకనో లేక బూటా సింగ్ నాలుక మందమో హాధీ, సైకిల్, హాత్ చెప్పాలనుకుంటున్నారు. అయితే, హాత్ అనేది ఇందిరాగాంధీకి వినిపంచడం లేదు. అది హాధీ, సైకిల్, హాధీ... అని వినబడుతూ ఉంది. ఏమిటో అర్థంకాక మూడో గుర్తేదో కనుక్కోమని అమె పక్కనే ఉన్న పివి నరసింహారావు కు చెప్పారు. ఆయన ఫోన్ అందుకున్నారు.

బహుభాష కోవిదుడయిన పివి, బూటా పలుకుబడి కూడా తెలిసిన వాడు కాబట్టి, ’ అరే సర్దార్ జీ...హాత్ నహీ పంజా బోలోనా,’ అని సలహా ఇచ్చారట. అపుడు బూటా సింగ్ మరొక సారి ఇందిరాగాంధీని లైన్ లోకి తీసుకుని ‘హాధీ, సైకిల్ ఔర్ పంజా ...పంజా’ అని అరిచారట ఆమెకు క్లియర్ గా వినబడేలా.

అపుడు ఇందిరా గాంధీ హస్తం, అభయమిస్తున్నట్లు కనిపిస్తుంది కాబట్టి హస్తం ఒకె అన్నారట.

లేకపోతే, సైకిల్ నో, ఏనుగులో ఖరారు చేయమని ఇందిరాగాంధీ సలహా ఇచ్చేవారే. చివరకు హస్తం కాంగ్రెస్ గుర్తు అయింది. అవు, ఎనుగు, సైకిల్ కాలక్రమంలో ఎవరెవరికో వెళ్లిపోయాయి.

మోదీ అధికారంలోకి వచ్చాక ఇందిరా గాంధీ ఎపుడో వదులుకున్న ఆవు- దూడ లోని గోవు ఒక సమస్య అయి కూర్చుంది. మొదట కాంగ్రెస్ పార్టీని ఉత్తర ప్రదేశ్ నుంచి తరిమేసిందిబహుజన్ సమాజ్ పార్టీ గుర్తుగా వెళ్లిన ఎనుగు..తర్వాత సైకిల్ కూడా కాంగ్రెస్ ను రాష్ట్రం నుంచి తరిమేసింది.

ఇపుడు సైకిల్ మీద లిఫ్ట్ కావాలని అఖిలేశ్ వెంట పడుతున్నాడు కాంగ్రెస్ రాహుల్.

ఇక్కడేమో ఆంధ్రలో తెలుగుదేశం వారి సైకిల్ జోరుగా దూసుకుపోతుంది. ‘హస్తం’ ఎంతచాపినా సైకిల్ ను ఆపడం కష్టమవుతూ ఉంది.