మనదేశంలో సూర్య దేవాలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. వాటిలో సుప్రసిద్ధమైనవి మాత్రం రెండే.  ఒకటి ఒడిషాలోని కోణార్క్ లోగల సూర్యదేవాలయం కాగా.. రెండోది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం పట్టణానికి చేరువలో ఉన్న అరసవిల్లి గ్రామంలోగల సూర్యదేవాలయం. ఇవి కాకుండా  దక్షిణార్క ఆలయం(గయ), బ్రాహ్మణ్య దేవ్ ఆలయం( మధ్యప్రదేశ్), సూర్యపహాడ్( అస్సాం), సూర్యనాథ్ ఆలయం( కుంభకోణం, తమిళనాడు) మొథేలా సూర్యదేవాలయం(గుజరాత్) ఉన్నాయి. అలాగే పాకిస్థాన్ లోని ముల్లాన్ లోనూ ప్రాచీన సూర్యదేవాలయం ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటారా..? ఈ వారం మన ‘‘యాత్ర’’లో భాగంగా సూర్యభగవానుడిని దర్శించుకుందామా..

అద్భుతా శిల్పకళా వైభవం కోణార్క్

క్రీ.శ.136 శతాబ్ధికి చెందినది ఈ కోణార్క్ సూర్య దేవాలయం. ఈ ఆలయ శిల్పకళా వైభవాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవంటే నమ్మండి. 12జతల చక్రాల రథాన్ని ఏడు గుర్రాలు లాగుతున్నట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. దీనిలో 12 చక్రాలు నెలలకు, మరో 12 చక్రాలు రాశులకు, ఏడు గుర్రాలు వారాలకు ప్రతీకగా సూచిస్తారు. పన్నెండేళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఈ ఆలయం ఇది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని, వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్నా అద్భుత శిల్ప సౌందర్యంతో నేటికీ శోభిల్లుతోంది . ఆలయ పై భాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం చేస్తూ, కుస్తీ లాంటి యుద్ధ కళలను అభ్యసిస్తోన్న భంగిమల్లో శిల్పాలు కనబడతాయి. ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు ఉంటాయి. అంతేకాదు.. ఆలయంలో ఉన్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

ప్రతాపరుద్రుడు నిర్మించిన దక్షిణార్క దేవాలయం

కాకతీయుల ప్రభ బిహార్ రాష్ట్రం గయలోనూ ధగధగలాడింది. మగధ రాజుల హయాంలో నిర్మించిన దక్షిణార్క దేవాలయం శిథిలం కాగా.. కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఆలయంలో మూల విరాట్ నడుముకు బెల్ట్, వంటిపై జాకెట్, పొడవైన బూట్లు ధరించి ఉంటాడు. ఈ ఆలయాన్ని దర్శించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.

వెయ్యేళ్ల నాటి మొధేరా ఆలయం..

గుజరాత్ రాష్ట్రం లో అహ్మదాబాద్ కు వంద కిలో మీటర్ల దూరం లో ‘’పుష్ప వతి ‘’నది ఒడ్డున ‘’మొధేరా’’దేవాలయం ఉంది. దీన్ని భీమ దేవ్ సోలంకీ అనే రాజు 1022-63లో నిర్మించాడు .ఈ ఆలయ నిర్మాణం లో సున్నాన్ని అసలు వాడక పోవటం విశేషం. సూర్యుని తొలికిరణం.. ఆలయంపై పడేలా దీని నిర్మాణం చేపట్టారు. ఆలయ కట్టడాలు చూపరులను ఆకట్టుకుంటాయి.