ప్రభుత్వాలు ఎంత ప్రోత్సాహకాలు అందించినా, ఎన్ని కఠిన చట్టాలు చేసినా లింగ వివక్షత  మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఆడ పిల్లలను గర్భంలోనే తుంచివేస్తున్నారని తెలిసి లింగ నిర్ధారణ పరీక్షలను నిషేదించాయి తెలుగు ప్రభుత్వాలు. ఇలా లింగ వివక్షతను తగ్గించే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆడ పిల్లలను కన్నందుకు మహిళలపై అత్తింటివారి వేధింపులు ఆగడంలేదు. తాజాగా ఇలా ఓ ఆడ శిశువును జన్మనిచ్చినందుకు భార్యకు కరెంట్ షాక్ పెట్టి తీవ్ర నరకాన్ని చూపించాడో భర్త. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచుసుంది.  

వివరాల్లోకి వెళితే విజయవాడ కానూరుకు చెందిన ఓ మహిళ రెండో కాన్పులో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే మొదటి నుండి ఆడపిల్లలను ద్వేషించే భర్త, తన భార్య ఆడపిల్లకు జన్మనిచ్చిందని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో విచక్షణను కోల్పోయిన అతడు భార్యకు కరెంట్ షాక్ ఇచ్చాడు.  దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమపెళ్లి చేసుకొని అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పెనమలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.