(శ్రవణ్ బాబు)

ఎన్‌టీఆర్ జీవితం ఆధారంగా మూడు-నాలుగు బయోపిక్‌లు రూపొందబోతున్నాయన్న వార్తలతో ఆయన పేరు మళ్ళీ ఒక్కసారిగా కేంద్రబిందువు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు, యాధృచ్చికంగా తమిళనాడులో ఎంజీఆర్ జీవితం ఆధారంగా కూడా తాజాగా ఒక చలనచిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వీరిరువురి జీవితాలమధ్య పోలిక రావటం అనివార్యం. అయితే, తమిళనాడు రాజకీయాలను దగ్గరనుంచి చూసిన తెలుగువారందరికీ, ఎంజీఆర్... రామారావుకంటే ఎన్నోరెట్లు పాపులర్ నేత అన్న సంగతి తెలిసిందే.  రామారావు జీవితంలో బ్రహ్మాండమైన విజయాలవంటి ఉత్థానాలతోబాటు, ఘోర పరాజయాలు, వెన్నుపోట్లు వంటి పతనాలు కూడా ఉన్నాయి. ఇక ఆయన చరమాంకం అయితే ఒక నల్లటి మచ్చగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. సొంతవాళ్ళే వెన్నుపోటు పొడిచి గద్దెనుంచి తనను దించేశారన్న మానసికక్షోభతోనే ఎన్టీఆర్ ప్రాణాలు విడిచారు. ఎంజీఆర్ పరిస్థితి అలాకాదు… సినిమాలలో, రాజకీయాలలో ఆయన ఒక అప్రతిహత నాయకుడు. కరుణానిధివంటి బలమైన ప్రత్యర్థి, ఉద్దండపిండం ఉన్నప్పటికీ రాజకీయాలలో ఆయనకు వ్యక్తిగతంగాగానీ, పార్టీపరంగాగానీ ఓటమి అనే మాటేలేదు. ముఖ్యమంత్రి పదవినెక్కిన నాటినుంచి చనిపోయేవరకు అదే పదవిలో కొనసాగారు. మరి మన నందమూరి ప్రస్థానం ఎంజీఆర్ స్థాయిలో అప్రతిహతంగా ఎందుకు సాగలేదనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

                                                                                                       వ్యక్తిత్వం

ఎంజీఆర్ బాల్యంలో కటిక దారిద్ర్యం అనుభవించారు. అందుకే ఆయన పేదరికం, ఆకలి వంటి కష్టాలు బాగా తెలుసు. ఉన్నతస్థితికి చేరుకున్నాక ఆ కష్టాలను మరిచిపోలేదు. సినీరంగంలో ఉన్నప్పుడుగానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాతగానీ పేదలపట్ల బాగా ప్రేమగా ఉండేవారు… ముఖ్యంగా పేదపిల్లలకు చదువు చెప్పించటానికి ఆసక్తి చూపేవారు. దీనికి తోడు ఆయనకు గొప్ప దాన గుణం ఉండేది. పరోపకారానికి ముందంజలో ఉండేవారు. ఎవరైనా కనిపించగానే మొదట భోజనం చేశావా అని కనుక్కుని, తినకపోతే భోజనం పెట్టించేవారు. అందుకే, ఇంట్లో ఏమీ లేకపోయినా, ఎసట్లో నీళ్ళు పడేసి, ఎంజీఆర్ దగ్గరకు వెళితే బియ్యంతో తిరిగి రావచ్చు అని అప్పట్లో తమిళనాడులో నానుడి ఉండేది. శత్రువు వచ్చి అడిగినాగానీ సాయం చేసేవారు. ప్రకృతి వైపరీత్యాలు, కరవులు వంటి సందర్భాలలో పెద్దమొత్తాలలో విరాళాలు ఇచ్చేవారు. చైనా యుద్ధం సందర్భంగా ప్రధానమంత్రి నిధికి లక్షరూపాయల విరాళం ఇచ్చారు. తన రిక్షాకారన్ చిత్రం విడుదల సందర్భంగా 6,000 మంది రిక్షా కార్మికులకు రెయిన్ కోట్లు పంచిపెట్టారు.  ఆయనకున్న 15 వేల అభిమాన సంఘాలు కూడా పెద్ద ఎత్తున సమాజసేవా కార్యక్రమాలను నిర్వహించేవి.

రామారావు విషయానికొస్తే, సినిమారంగంలో ఉన్నకాలంలో ఆయన పేరుగాంచింది క్రమశిక్షణకు, పట్టుదలకు మాత్రమే… ఎంజీఆర్ లాగా దానగుణానికి, పరోపకారానికి కాదు. రామారావు పెద్ద పిసినారి అని, పిల్లికి కూడా బిచ్చం పెట్టడని, సినిమాలలో నటించేటప్పుడు ధరించే సూట్లు, ఆభరణాలు, గదలు ఇంటికి తీసుకెళ్ళిపోయేవాడని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. సంపాదనకోసం, వచ్చిన ప్రతి ఆఫర్ నూ ఒప్పకునేవారనే విమర్శకూడా ఉంది(300పైగా చిత్రాలలో నటించారు). రాజకీయాలలోకి వచ్చేముందే పిల్లలందరికీ ఆస్తులు పంచి ఇచ్చేసి, 'నా దగ్గరేముంది బూడిద' అన్నారని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తుంటారు. ఆఫ్ స్క్రీన్ ఇమేజి విషయంలో ఎంజీఆర్ కున్నంత పేరు రామారావుకు లేదనే చెప్పాలి.

సినిమా ఇమేజ్

ఎంజీఆర్ చేసింది 136 సినిమాలే అయినప్పటికీ ఆయన తమిళ సినిమారంగంలో వేసిన ముద్ర మహత్తరమైనది. 1950వ దశకంలోనే నంబర్ వన్ స్థాయికి చేరుకున్నఎంజీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టేవరకు అదే స్థానంలో ఉన్నారు. శివాజీ గణేశన్ ఉన్నప్పటికీ ఆయనకు గొప్ప నటుడిగా మాత్రమే పేరుంది. పాపులారిటీలో మాత్రం ఎంజీఆర్ దే పైచేయిగా ఉండేది. మరోవైపు ఆయన పోషించిన పాత్రలన్నీబలహీనులను, బాధితులను ఆదుకునే రాబిన్ హుడ్ లాగా ధీరోదాత్తంగా ఉండేవి. అదీకాక మొదటినుంచీ రాజకీయాలలో ఉండటంవలన ఎంజీఆర్ తన పాత్రలన్నీ ఆదర్శవంతంగా, ఉత్తమ విలువలతో కూడినవై ఉండేటట్లుగా చూసుకునేవారు...ఒక పద్ధతి ప్రకారం తన సినీ ఇమేజ్ ను సృష్టించుకున్నారు. అందుకే ఆయన పాత్రలు ఎప్పుడూ సిగరెట్, మద్యం తాగటంగానీ, వివాహేతర సంబంధాలు పెట్టుకోవటంగానీ చేయవు. అంతేకాదు… ఆయన పాత్రలకు సినిమాలలో పరాజయం అన్న మాటే ఉండదు. అసలు ఆయన పాత్ర చనిపోవటాన్ని అభిమానులు ఒప్పకోరు. ఒకటో, రెండో చిత్రాలలో ఆయన పాత్ర చనిపోతే ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ లయ్యాయి. ఆయన పాత్రలు ఎప్పుడూ నవయువకుడివే అయిఉండేవి. ముసలిపాత్రలుగానీ, వికలాంగులపాత్రలుగానీ, నెగెటివ్ పాత్రలుగానీ ఒక్కటికూడా వేయలేదు. అందుకే బాహ్యప్రపంచంలో కూడా ఎంజీఆర్ కు మరణం ఉండదు అని, ఆయన దైవాంశ సంభూతుడని అభిమానులు నమ్మేవారని చెబుతారు.

ఈ విషయంలో రామారావును చూస్తే, ఆయన ఎంజీఆర్ కంటే రెండు రెట్లకు పైగా సినిమాలు చేశారు. అయితే తెలుగు సినిమారంగంలో నంబర్ వన్ స్థానం మాత్రం నందమూరి-అక్కినేని మధ్య దోబూచులాడుతూ ఉండేది. వీరిద్దరిమధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుండేది. ఒక్కో సందర్భంలో అక్కినేని పారితోషికమే ఎక్కువ ఉండేది. ఒక్కో కాలంలో ఒక్కొకరి ఆధిపత్యం ఉండేది. 1976 వరకు ఈ పరిస్థితి కొనసాగింది. అయితే 1977లో దానవీరశూరకర్ణ, అడవిరాముడు, యమగోల వంటి సూపర్ డూపర్ హిట్స్ చేజిక్కించుకుని రామారావు నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించారు. నాటినుంచి 1982లో రాజకీయరంగప్రవేశం చేసేవరకు తిరుగులేనివిధంగా నంబర్ వన్ స్థానంలో కొనసాగారు. మొదట్లో రాముడు, కృష్ణుడు వంటి పాత్రలతో జనాన్ని భక్తిపారవశ్యంలో ముంచిన రామారావు, తర్వాతి కాలంలో రావణాసురుడు, దుర్యోధనుడు వంటి నెగెటివ్ పాత్రలను పోషించటానికి ఎక్కువగా మొగ్గు చూపారు.  అయితే కెరీర్ చివరలో చేసిన సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి వంటి చిత్రాలు ఆయన కెరీర్ కు ఎంతో ఉపయోగపడ్డాయి.

రాజకీయ ప్రస్థానం

ఎంజీఆర్ మొదటనుంచీ రాజకీయాలలో ఉన్నారు. 1953లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డీఎంకేలో చేరారు. సినిమాలు చేస్తూనే పార్టీలో కూడా చురుకుగా వ్యవహరించేవారు. 1967లో ఎమ్మెల్యేగా గెలిచి మొట్టమొదటగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తదనంతర కాలంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కరుణానిధి, ఎంజీఆర్ పాపులారిటీని చూసి ఓర్చుకోలేక ఆయనను తొక్కేయటానికి ప్రయత్నించారు. దానితో ఎంజీఆర్ 1972లో అన్నాడీఎంకే పేరుతో సొంత పార్టీని స్థాపించుకున్నారు. దానికి పెద్దగా సిద్ధాంతాలు గట్రా లేకపోయినా, మేధావుల అండ లేకున్నా ఎంజీఆర్ పాపులారిటీతోనే ముందుకెళ్ళింది. 1977లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, జనతా పార్టీలతో తలపడి చతుర్ముఖ పోటీలో కూడా అద్భుతమైన మెజారిటీ సాధించి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యారు. నాటినుంచి 1987 డిసెంబర్ 24న చనిపోయేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రి. మధ్యలో 1984లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి ఎంజీఆర్ కిడ్నీవ్యాధితో న్యూయార్క్ లో ఆసుపత్రిలో ఉన్నారు. అయినాగానీ కేవలం ఆయన ఫోటోలు, వీడియోలతో ప్రచారం చేసిన అన్నాడీఎంకే పార్టీ, ప్రతిపక్ష డీఎంకే-కాంగ్రెస్ కూటమిపై అఖండ మెజారిటీతో విజయం సాధించటం ప్రజలలో ఆయనకున్న అఖండ ఆదరణను చాటిచెబుతుంది. ఎంజీఆర్ మొదటినుంచీ రాజకీయాలలో ఉండటంవలన, ఆ అనుభవం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఉపయోగపడింది.

నాదెండ్ల భాస్కరరావుతో కలిసి రామారావు 1982 మార్చిలో తెలుగుదేశాన్ని స్థాపించారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన రాజకీయ శూన్యత వేళ్ళూనుకునిఉంది. వరసగా ముఖ్యమంత్రులను మారుస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీనికి నిదర్శనం 1981లో జరిగిన హైదరాబాద్, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవటం. ఈ పరిస్థితులన్నీ గమనించి కొత్తపార్టీకి అద్భుతమైన అవకాశం ఉందని పసిగట్టిన నాదెండ్ల, రామారావుతో కలిసి పార్టీని పెట్టారు. అలా పుట్టుకొచ్చిన తెలుగుదేశంపార్టీకి, నాదెండ్ల ఊహించినట్లుగానే పరిస్థితులు అన్నీ అనుకూలించాయి. ఈనాడు దినపత్రిక కూడా ఇతోధికంగా సహకరించింది. దీనితో 1983ఎన్నికల్లో తిరుగులేని విజయం లభించింది. ఆ సమయంలో ఎన్టీఆరే కాదు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా గెలిచే పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపనతోనే రాజకీయాలలో ప్రవేశించిన రామారావుకు ఎత్తులు, పై ఎత్తులు తెలియదు... అంతకుముందు దాదాపు 30 ఏళ్ళపాటు తాను న్యూస్ పేపర్ కూడా చదవలేదని ఆయనే స్వయంగా చెప్పారు. అందుకే రాజకీయాలలో ఆయన తొట్రుపడ్డారు. పదవిలోకొచ్చిన సంవత్సరమున్నరకే రామారావు వెన్నుపోటు ఎదుర్కొన్నారు. 1984లో నాదెండ్ల తిరుగుబాటు చేశారు. ప్రజలలో రామారావుకు మంచి మద్దతు లభించింది. బలపరీక్షలో కూడా ఆయన విజయం సాధించారు. వెంటనే జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆయనకే పట్టం కట్టారు. అయితే 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ప్రజలు గద్దె దించేశారు. స్వయంగా రామారావుకూడా తెలంగాణలోని కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అనామక అభ్యర్థి చేతిలో ఓడిపోవటం మరో విశేషం. తర్వాత రామారావు శ్రీనాథ కవిసార్వభౌముడు, సమ్రాట్ అశోక, బ్రహ్మర్షి విశ్వామిత్ర వంటి సినిమాలు తీసుకోవటం(అన్నీ ఫ్లాపులే) లక్ష్మీపార్వతిని వివాహమాడటం వంటి సొంతపనులలో పడి పార్టీని, ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను పట్టించుకోకపోయినా, ఆసెంబ్లీకి వెళ్ళకపోయినా కాంగ్రెస్ పార్టీ యధావిధిగా ముఖ్యమంత్రులను తరచూ మారుస్తుండటం, అవినీతి పెరిగిపోవటం వంటి కారణాలతో 1994 ఎన్నికల్లో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆరునెలలుకూడా జరగకుండానే రామారావుకు మరో వెన్నుపోటు ఎదురయింది… తిరిగి పదవీచ్యుతులయ్యారు.

నాయకత్వం

నాయకత్వం విషయంలో ఎంజీఆర్ అసమాన్యుడు అని చెప్పాలి. నిర్వహణా సామర్థ్యం పుష్కలంగా ఉంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలిసినవాడు. మాటవిననివారిని, అసమ్మతి వర్గాన్ని నిర్దాక్షిణ్యంగా అణచేసేవాడు. మరోవైపు పరిపాలనలో ప్రజాకర్షక, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసేవాడు. మధ్యాహ్న భోజన పథకం, మద్యనిషేధం, స్త్రీలకు ప్రత్యేక బస్సులు వంటి పథకాలతో ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఎంజీఆర్ చనిపోయినప్పుడు తమిళనాడు అల్లకల్లోలమయింది. ఆయన మృతిని అభిమానులు భరించలేకపోవటంతో రేగిన హింసాకాండలో 29 మంది చనిపోయారు. మరో 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంజీఆర్ చనిపోయి ఇప్పటికి 30 ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ తమిళనాడులో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన ఫోటోలు దర్శనమిస్తూ ఉంటాయి. అంతలా ఆయనను అభిమానులు కొలుస్తూ ఉంటారు. ఇప్పటికీ తమిళ సినిమాలలో, రాజకీయాలలో ఆయన ప్రస్తావన తరచూ వినబడుతూ ఉంటుంది. 1987లో ఆయనను(చనిపోయిన తర్వాత) భారతరత్న పురస్కారంతో గౌరవించింది.

తెలుగుదేశం పార్టీ ద్వారా విద్యావంతులైన యువకులకు, బీసీలకు అత్యధికంగా టిక్కెట్లు ఇచ్చి తెలుగునాట ఒక కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఒక గణనీయమైన మార్పుకు రామారావు కారణమయ్యారు. రెండురూపాయలకే కిలో బియ్యం, కరణం-మున్సబు, పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం, కౌన్సిల్ రద్దు, మధ్యాహ్న భోజనపథకం, తెలుగుగంగ వంటి ఎన్నో నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. తెలుగుజాతికి, తెలుగుభాషకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అయితే రాజకీయాలకు కొత్త కావటంతో ఆచరణసాధ్యంకాని ఆలోచనలతో పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకునేవారు. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించటం అలాంటిదే. చిత్రవిచిత్రమైన వేషధారణలు చేసేవారు. దీనితో రామారావు పెద్ద లాఫింగ్ స్టాక్ అయ్యారు. పత్రికలలో ఆయనపై జోకులు బాగా పేలేవి. ప్రభుత్వోద్యోగులతో ఆయనకు అస్సలు పడేదికాదు. ఒక సందర్భంలో సెక్రెటేరియట్ లో ఆయన విధించిన విలక్షణమైన నిబంధనలతో విసుగెత్తి, కొందరు ఉద్యోగులు ఆయన ఛాంబర్ లోకి ప్రవేశించి చెప్పనలవికాని భాషలో బూతులు తిడుతూ ఆయన టేబుల్ పైన ఎక్కి భౌతికదాడికికూడా దిగబోయారు. అక్కడే ఉన్న ఒక డీఎస్పీ రామారావును కాపాడారు. ఏ ముఖ్యమంత్రీ ఇంత దారుణమైన అవమానానికి గురికాలేదని చెబుతారు. నాయకత్వ లోపం కారణంగానే ఆయన రెండుసార్లు వెన్నుపోటుకు గురయ్యారని చెప్పాలి. రామారావును దించేసి గద్దెనెక్కిన సమయంలో చంద్రబాబు నాయుడు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసి, ఆయనను అవినీతిపరుడని ఆరోపించి, తర్వాతికాలంలో రామారావు ఫోటోను కూడా ఎక్కడా కనిపించకుండా చేయటానికి ప్రయత్నించారు. దానికి తోడు అభిమానులుగానీ, ఆయన సొంత సామాజికవర్గంగానీ రామారావుకు అండగా నిలబడలేదు. అయితే తదనంతర పరిణామాలలో మళ్ళీ రామారావు బొమ్మనే అడ్డుపెట్టుకుని రాజకీయాలు కొనసాగిస్తున్నారు.

మొత్తం మీద చూస్తే, ఇరువురి నేతల్లో దైవాంశ సంభూతుడు అనే అతిశయోక్తి అలంకారాన్ని వాడాల్సివస్తే అది ఎంజీఆర్ కే సరిపోతుందని చెప్పాలి. ఎంజీఆర్ ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగటానికి రెండే కారణాలు ప్రధానంగా కనబడతాయి. ఒకటి ఆన్ స్క్రీన్ లో ఆయన పోషించిన రాబిన్ హుడ్ లాంటి ధీరోదాత్త పాత్రలకు ఆయనకున్న ఆఫ్ స్క్రీన్ ఇమేజి మ్యాచ్ కావటం, రెండు ఆయనకు పుష్కలంగా ఉన్న నాయకత్వ లక్షణాలు, నిర్వహణా సామర్థ్యం. రెండుసార్లు(1967, 1984 సం.లలో) ఆసుపత్రిలో ఉండికూడా ఎన్నికలలో గెలిచిన ఘనత దేశంలో ఎంజీఆర్ కు తప్ప మరేనేతకూ లేదు. ఆఖరికి చివరిదశలో దీర్ఘకాలం అసుపత్రిలో ఉండికూడా మంత్రులనుగానీ, అధికారులనుగానీ తన కనుసన్నలలో నడిపిన సామర్థ్యం ఆయన సొంతం.  రామారావుకు ఈ రెండు లక్షణాలూ బాగా లేకపోవటం వల్లనే ఆయన జీవితం విషాదాంతమయింది.

 

( *శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ ఫోన్ 99482 93346)