బరువు తగ్గి.. సన్నగా, నాజుగా ఉండాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అందుకోసం వ్యయ ప్రయాసలు పడుతుంటారు. కొందరు తిండి తినడం మానేస్తారు... మరికొందరు వ్యాయామ బాట పడుతుంటారు. ఈ బరువు తగ్గే ప్రాసెస్ లో వేలకు వేల రూపాయలను కూడా చాలా మంది ఖర్చు చేస్తుంటారు. అయితే.. మన చేతిలో రూపాయి ఖర్చు అవడం పక్కన పెట్టి.. బరువు తగ్గే క్రమంలో డబ్బు సంపాదించవచ్చు    అంటోంది ఒక యాప్. మరి ఆ యాప్ విశేషాలేంటో చూసేద్దామా..

లండన్ కి చెందిన ఓ కంపెనీ.. ఇటీవల ‘ స్వెట్ కాయిన్స్’ పేరిట ఓ యాప్ ని విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా కంపెనీ.. క్రమశిక్షణతో వ్యాయామం చేసి చెమట చిందించేవారికి పాయింట్స్‌ రూపంలో మార్కులేస్తూ డబ్బులిస్తోంది. బిట్‌కాయిన్స్‌ మాదిరిగా స్వెట్‌కాయిన్స్‌ ని క్రియేట్‌ చేసి ఎకౌంట్‌లో జమ చేస్తోంది. వాటితో సంబంధిత స్టోరుల్లో ఫిట్‌నెస్‌ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు వాడొచ్చు. ఉదాహరణకు 550 స్వెట్‌కాయిన్స్‌ ఎకౌంట్‌లో జమ అయితే రూ.6,000 విలువైన ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ని కొనుగోలు చేయవచ్చు.

యూజర్ల వ్యాయామ పద్ధతుల్ని ట్రాక్‌ చేసేందుకు యాప్‌లో ఇన్ బిల్ట్ సాఫ్ట్‌ వేర్‌ ఉంది. ప్రస్తుతానికి  అమెరికా, బ్రిటన్‌, ఐర్లాండ్‌ దేశాల్లోనే ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని దేశాల్లో ప్రవేశపెట్టేందుకు రూపకర్తలు సిద్ధం అవుతున్నారు. ముందే నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ‘స్వెట్‌కో.ఇన్‌’ వెబ్‌సైట్‌లో మెయిల్‌ ఐడీతో రిజిస్టర్‌ అవ్వండి.