శశికళ తక్షణం ముఖ్యమంత్రి కావాలనే క్యాంపెయిన్ మొదలయింది. పార్టీ ప్రచార కార్యదర్శి తంబి దురై దీనికి శ్రీకారం చుట్టారు. పన్నీర్ సెల్వం బిజెపి అండ కోరడానికి వ్యతిరేకంగా ఇది తిరుబాటని చెబుతున్నారు.
ఇక ఆలస్యం వద్దు, వెంటనే ముఖ్యమంత్రి పదవి చేపట్టండి రెండురోజుల కిందటే ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన శశికళకు పార్టీసీనియర్ నాయకుడు తంబిదురై విజ్ఞప్తి చేశారు. తంబిదురై విజ్ఞప్తి మామూలు విషయం కాదు. రాజకీయంగా తీవ్రపరిణామాలు తీసుకువచ్చే నిర్ణయం. తంబిదురై గతంలో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా కూడాపనిచేశారు. ఈ విజ్ఞప్తి కొద్ది సేపటికిందట ఆయన ఒక లేఖ ద్వారా చేశారు.
ఇది ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఎసరు పెట్టే పథకమే.
పన్నీర్ సెల్వం బిజెపికి దగ్గరకావడంతో పార్టీలో ఆయనకు వ్యతిరేకత మొదలయిందని చెబుతున్నారు. బిజెపి అండచూసుకుని పన్నీర్ సెల్వం విర్రవీగుతున్నాడని భావించే వాళ్లంతా ఇపుడు తంబిదరై వెంటన నడిచే అవకాశం ఉంది.
పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి పదవి రెండు ఒకే వ్యక్తి చేతిలో ఉండటం అవసరమనేది తంబిదురై వాదన.
“ పురచ్ఛి తళైవి అమ్మ ప్రారంభించి పూర్తిచేయలేకపోయిన ప్రభుత్వం, పార్టీ కార్యక్రమం ప్రభుత్వం, పార్టీ పగ్గాలు ఒకే వ్యక్తి చేతిలో ఉన్నపుడే పూర్తయ్యేవీలుంటుంది,” అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తంబిదురై ఇపుడు పార్టీ ప్రచార కార్యదర్శి గా పనిచేస్తున్నారు.
ఆయన తన వాదనను ఇలా కొనసాగించారు.
"పార్టీనాయకత్వం, ప్రభుత్వం వేర్వేరు వ్యక్తుల చేతుల్లో ఉండటాన్ని ప్రజలు ఎక్కడా ఆమోదించలేదు. ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి చేతిలోఉన్నపుడే పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాలను ప్రభుత్వం నెరవేర్చగలదు. ప్రభుత్వం నాయకత్వం, పార్టీ నాయకత్వం వేర్వేరు వ్యక్తుల చేతుల్లో ఉన్నపుడు, ప్రభుత్వాలు కష్టాల్లో పడ్డయి. ప్రజలకిచ్చిన వాగ్ధాలను నెరవేర్చడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వం, పార్టీ కి ఒకే నాయకత్వంలో ఉన్నపుడు ఎన్నికల వాగ్ధాలను నెరవేర్చే విషయం ప్రభుత్వాధినేతగా దృష్టి కేంద్రీకరించడం జరగింది. దీనిని పలుమార్లు చరిత్ర రుజువుచేసింది. రెండేళ్లో పార్లమెంటు ఎన్నికలు వస్తున్నందున,పార్టీకి ప్రజలనుంచి హృదయ పూర్వకంగా మద్దతు లభించాలంటే పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం తక్షణావసరం."
ఈ ప్రకటన వెలువడిన వెంటనే చాలా మంది పార్టీ నేతలు మద్దతు పలికారు. పన్నీర్ సెల్వానికి రోజులు దగ్గిర పడ్డట్టే నని అనుకుంటున్నారు. ఇపుడ బిజెపి ఆయనను ఎలా కాపాడుతుందో చూడాలి.
