టూరిస్ట్ స్పాట్ గా కోటిలింగాల

Telanganas Koti Lingala to be tourism spot soon
Highlights

  • పర్యాటక ప్రాంతంగా కోటిలింగాల
  • డిసెంబర్ 4వ తేదీ నుంచి బోటింగ్

శాతవాహనుల తొలి రాజధానిగా పేరొందిన కోటిలింగాల మహా పుణ్య క్షేత్రం త్వరలో పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎంతో చారిత్రక చరిత్ర కలిగిన ఈ కోటిలింగాలను రాష్ట్రంలోనే గొప్ప టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే కోటేశ్వర సిద్ధేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న గోదావరి నదిలో బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు పర్యాటక శాఖ అధికారులు కోటిలింగాల పరిసర ప్రాంతాల్లో సర్వే కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ పర్యాటక ప్రాంతానికి రూట్ మ్యాప్, టూర్ ప్యాకేజీ కూడా ఫైనలైజ్ చేయనున్నారు. అంతేకాదు.. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న బోటింగ్ పాయింట్ కి సమీపంలో ఒక గెస్ట్ హౌజ్ ని, హరితా రెస్టారెంట్ ని కూడా నిర్మించాలనుకుంటున్నారు.

  కోటిలింగాలకు దిగువ ప్రాంతంలో ఉన్న ఎల్లంపల్లి ప్రజెక్టు వద్ద సంవత్సరం పొడవునా నీరు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ  ప్రాంతం కరీంనగర్ కి 60కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు బోట్స్ ఏర్పాటు చేయాలని, ఒకటి 50 సీట్ల సామర్థ్యంతో మరొకటి 35 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఆ రెండు బోట్లకు శాతవాహన రాజులైన శాతకర్ణి, పులోమావి ల పేర్లు పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు అయితే.. ట్రావెలింగ్ రూట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. కాకపోతే కోటిలింగాల నుంచి ఎల్లంపల్లి, కోటిలింగాల నుంచి రాయపట్నం బ్రిడ్జ్ వరకు బోట్లు నడపాలని పర్యాటకశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో బోటింగ్ చాలా బాగుంటుంది.. పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే టికెట్ ధర, రూట్ మ్యాప్, టైమ్ తదితర సమాచారాన్ని విడుదల చేయనున్నట్లు  అధికారులు చెప్పారు. వచ్చే నెల 4వ తేదీన తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్  కార్పొరేషన్ ఛైర్మన్ పేర్వారం రాములు బోటింగ్ ప్రారంభించనున్నారు.

loader