ఆ యువకుడు ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లాడు. కానీ అక్కడ తాను ఊహించినట్లు సంపాదించలేకపోయాడు.  అయితేనేం సంపాదించే అరకోర డబ్బులనే పొదుపుగా వాడుతూ తల్లిదండ్రులకు కూడా కొంత మొత్తం పంపించేవాడు. కానీ కాలం అతడికి ఆ సంతోషం కూడా మిగలనివ్వకుండా చేసింది. అనుకోని కారణాలతో అతడి జీతానికి కోత పడింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బాధితుడు తన స్నేహితులకు వాట్సాఫ్ కాల్ చేసి తన తల్లిదండ్రులకు ఇకనుంచి డబ్బులు పంపలేను. మా అమ్మా నాన్నను, తమ్మున్ని జాగ్రత్తగా చూసుకోవాలంటూ చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద గాధ తెలంగాణ నుండి దుబాయ్ కి వెళ్లిన ఓ గల్ఫ్ బాధితుడిది.  

వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్లకు చెందిన శంకర్, కళావతి ల కొడుకు తోట నాగరాజు(24)  ఉపాధి కోసం దుబాయ్ కి వెళ్లాడు. అక్కడ అతడు వాహనాల క్లినింగ్ పనులు చేస్తూ నెలకు 500 దిర్హమ్స్( ఇండియన్ కరెన్సీలో 8779) సంపాదించేవాడు. అయితే అతడు పనిచేసే కంపెనీ ఒక్కసారిగా జీతాన్ని 100 ( రూ. 1756) దిర్హమ్స్ కి తగ్గించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నాగరాజు తాను పనిచేసే చోటే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తమకు  వాట్సాఫ్ కాల్ చేసి తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడని మృతుడి స్నేహితులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకుని అతడి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. అతడికి పెళ్లి చేయాలని సంబంధాలను చూస్తున్నామని, వచ్చే నెలలో ఇండియాకు వస్తానని చెప్పాడని తెలిపారు. ఇంతలోనే ఈ  అఘాయిత్యం జరగిందని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.