చెన్నై:  తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కాకిని రక్షించబోయి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు మృత్యువాత పడ్డాడు. గురువారం రాత్రి ఎలక్ట్రిక్ కేబుల్ లో చిక్కుకున్న కాకిని కాపాడబోయి విద్యుత్ షాక్ తగిలి అతను మరణించాడు. 

మృతుడు పల్లికనాయిలోని మీనాక్షిపురానికి చెందిన రామ్ కుమార్ (28). తోరాయిపక్కంలోని సిటిఎస్ లో అతను ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం రాత్రి భార్య పవిత్ర, అతను అపార్టుమెంటులోని మొదటి అంతస్థు బాల్కనీలో మాట్లాడుకుంటూ ఉండగా ఆ సంఘటన జరిగింది.

పవిత్ర గర్భవతి, ఆమెకు కవలలు జన్మించే అవకాశం ఉంది. తమ బాల్కనీలోని ఈబీ వైర్ లో చిక్కుకుని కాకి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని రామ్ కుమార్ దంపతులు గుర్తించారు. దాన్ని రక్షించడానికి రామ్ కుమార్ ప్రయత్నించాడు. కాకిని రక్షించినప్పటికీ రామ్ కుమార్ మాత్రం విద్యుత్ షాక్ తగిలి మరణించాడు. 

విద్యుత్ షాక్ కు అతను బాల్కనీలోంచి ఎగిరి గ్రౌండ్ ఫ్లోర్ లో పడ్డాడు.  ఇదంతా అతని భార్య ముందే జరిగింది. దాంతో పవిత్ర కేకలు పెట్టింది. ఆమె అరుపులు విని పొరుగువారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తేల్చారు.