ఆయనా చాయ్ వాలా, కోటీశ్వరుడు: కర్ణాటక ఎన్నికల్లో పోటీ

ఆయనా చాయ్ వాలా, కోటీశ్వరుడు: కర్ణాటక ఎన్నికల్లో పోటీ

బెంగళూరు: ఆయనో టీ సెల్లర్. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  ఆయన 42 ఏళ్ల పి. అనిల్ కుమార్. బెంగళూరులోని బొమ్మనహళ్లి నియోజకవర్గంలో పోటీకి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 

తన ఆస్తిని ఆయన రూ.339 కోట్లుగా ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థుల్లో ఆయనే అత్యంత సంపన్నుడు. ఆయనకు 16 కార్లు ఉన్నాయి. వాటిలో విదేశీ బ్రాండ్లు కూడా ఉన్నాయి. వాటి పేర్లను ఆయన వెల్లడించలేదు. 

జీవితం తొలి దశలో కేరళకు చెందిన ఆయన తీవ్రమైన కష్టాలను ఎదుర్కున్నారు. తండ్రి మరణించిన తర్వాత తల్లి తన ముగ్గురు పిల్లల పోషణ కోసం ఇళ్లలో పనిమనిషిగా పనిచేసేది. తన తల్లి ఫ్లోర్స్ ఊడ్చేదని, బాసన్లు కడిగేదని, నాలుగు ఇడ్లీలు మాత్రమే ఉండేవని, తమకు పెట్టిన తర్వాత తాను తినేదని అనిల్ అన్నట్లు దక్కన్ క్రానికల్ రాసింది. అలా చెప్పినప్పుడు అనిల్ కంటతడి పెట్టినట్లు కూడా ఆ మీడియా రాసింది. 

పేదరికం కారణంగా అనిల్ కుమార్ మూడో స్టాండర్డ్ తో చదువు ఆపేశాడు.  తన 11 ఏళ్ల వయస్సులో 1985లో అనిల్ బెంగళూరు వచ్చాడు. రాత్రుళ్లు ఆయన దుకాణాలు మూసేసిన తర్వాత వాటి ముందు పడుకునేవారు. కొన్నాళ్ల తర్వాత ఓ దుకాణంలో పనికి కుదిరాడు. మామిడి కాయలను ఒక చోటు నుంచి మరో చోటికి చేరవేసే పని అది. 

ఆ తర్వాత చిన్నపాటి సంస్థలకు చాయ్ సరఫరా చేస్తూ వచ్చారు. 1990 ప్రాంతంలో ఐటి బూమ్ తో బెంగళూరులో ఐటి కంపెనీలు, షోరూంలు పెద్ద యెత్తున వచ్చాయి. దాంతో ఆయన వ్యాపారం విస్తరించింది. 

వివాహం తర్వాత ఆయన దశ తిరిగింది. సొంత ఇంటి కోసం దంపతులు ఓ స్థలం కొనుగోలు చేశారు. అయితే తాను కొన్న ధరకు రెండింతలు ఇస్తానని ఓ వ్యక్తి రావడంతో దాన్ని అమ్మేశాడు. అది ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టడానికి మార్గం చూపింంది. దాంతో ఆయన దశే మారిపోయింది.

స్థలాలు కొంటూ ఎక్కువ ధరలకు అమ్ముతూ వచ్చాడు. ఇదంతా 1990 దశకం చివరలో జరిగింది. ఆరేళ్లలో కోట్లు సంపాదించారు. ఎనిమిదేళ్ల క్రితం బొమ్మనహళ్లిలో ఎంజె ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. బిజెపి తరఫున బొమ్మనహళ్లిలో సితీష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా అనిల్ కుమార్ పోటీ చేయడానికి సిద్ధపడ్డారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos