ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు వైసీపీ నేతలపై సెటైర్లు వేసుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు

తెలుగుదేశం నేతల్లో పిచ్చి పీక్స్ కి చేరిందా? నేతల ప్రవర్తన చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ.. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో.. సమావేశాలకు టీడీపీ, బీజేపీ నేతలు మాత్రమే హాజరయ్యారు.

ప్రతిపక్షం లేకపోవడంతో.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు. హోమ్ మంత్రి చినరాజప్ప అయితే.. ఏకంగా స్వీట్లే పంచిపెట్టారు. అయితే ఈ స్వీట్లు పంచడంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు చమత్కరించడం గమనార్హం.

ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు జరుతున్నాయని హోం మంత్రి గారు స్వీట్స్ పంచుతున్నారని పలువురు ఎమ్మెల్యేలు చమత్కరించారు. ఇందుకు స్పందించిన హోం మంత్రి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షం లేని అసెంబ్లీని చూడాలని సీఎం అనుకుంటున్నారని ఎమ్మెల్యేలకు బదులిచ్చారు. మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలు దాని రిహార్సల్స్ గా ఉన్నాయని జోస్యం చెప్పుకొచ్చారు. ఇక ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ అయితే.. డోస్ కాస్త ఎక్కువగానే పెంచి మాట్లాడారు. వైసీపీ వైరస్ లాంటిదని.. ఆ వైరస్ లేకపోయే సరికి అసెంబ్లీ అంతా ప్రశాంతంగా ఉందంటూ పేర్కొన్నారు.

వీరి సంభాషణ అంతా వింటుంటే.. టీడీపీ నేతలు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని.. అందుకే ఇఫ్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని రోజా విమర్శించడం గమనార్హం.