ఆనం బ్రదర్స్ ఎఫెక్ట్... టీడీపీలో ఆందోళన రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన ఆనం సోదరులకు సరైన గుర్తింపు, పదవి ఇవ్వలేదని వైసీపీలో చేరేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.కాగా.. ఆనం బాటలోనే చల్లా  రామకృష్ణా రెడ్డి కూడా వైసీపీలో చేరాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే.. ముందు జాగ్రత్తగా చల్లాతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆయనకు మరికొద్ది రోజుల్లో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి  కట్టబెడతామని హామీ ఇచ్చారు.రెండు మూడు రోజుల్లోగా అధికారికంగా ప్రకటించనున్నారు. 
2014లో ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి చల్లా రామక్రిష్ణారెడ్డి టీడీపీలో చేరారు. అప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ప్రచారం. ఐదారు రోజుల క్రితం ప్రభుత్వం 17 కార్పొరేషన్ల  నామినేటెడ్‌ పదవులను భర్తీకి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ కడప రీజనల్‌ చైర్మన్‌ పదవి చల్లా రామక్రిష్ణారెడ్డికి కేటాయించారు. అయితే.. రాజకీయాల్లో సీనియర్‌ అయిన తన స్థాయిని తగ్గించి రీజనల్‌ చైర్మన్‌ పదవి ఇస్తారా..? అంటూ చల్లా ఈ పదవిని తిరస్కరించారు. 

మంగళవారం చల్లా అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి ఏకాంతంగా చర్చించారు. తాను కోరిన పదవి ఇవ్వకుంటే వైసీపీలో చేరతానని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ విషయంలో చంద్రబాబు కూడా కాస్త వెనక్కి తగ్గారు.ఈ నేపథ్యంలో సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.