సమాజానికి కొత్త మార్గాన్ని పరిచయం చేసిన వ్యక్తి బుద్ధుడు. అందుకే ఇప్పటికే.. ఈ బుద్ధుడు చెప్పిన సూత్రాలను చాలా మంది ఆచరిస్తుంటారు. ఆయన పేరునే మతంగా మార్చి.. శాంతి మార్గంలో పయనించేందుకు బౌద్ధమతాన్ని స్వీకరిస్తున్నవారు ఉన్నారు. గౌతమ బుద్ధుడు కూడా ఒకప్పుడు సాధారణ మనిషే. ఒక రాజ్యానికి యువ రాజుగా ఉన్న గౌతమ బుద్ధుడు ఓ రావి చెట్టు కింద జ్ఞానోదయం పొంది మహానుభావుడుగా మారాడు. ఇదంతా ఇప్పటివరకు మనకు తెలిసిన కథే. మరి.. బుద్ధుడికి  జ్ఞానోదయం ఎక్కడ జరిగిందో తెలుసా..? బిహార్ రాష్ట్రంలోని గయ అనే ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు మన ‘‘యాత్ర’’ గయాకి చేద్దామా...

బీహార్‌లో గయ ఒక ముఖ్యపట్టణం.  ఈ గయ కేవలం బౌద్ధులు మాత్రమే కాదు.. హిందువులు కూడా పవిత్రస్థలంగానే భావిస్తారు. బుద్ధుడి సిద్ధాంతాన్ని ఇక్కడి వారంతా శిరసా వహిస్తూ ఉంటారు. క్రీ.శ 1810లో గయ రెండు భాగాలుగా ఉండేది. ఒక భాగం పూజారులు నివసించే భాగం. ఈ భాగాన్ని గయ అనేవారు. రెండవ భాగంలో న్యాయవాదులు, వ్యాపారులు ఉండేవారు. ఇప్పుడు బుద్ధగయ గడిచిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. వెనకటి సందడి లేకపోయినా ప్రశాంతతతో కూడిన గంభీర వాతావరణం ఊరంతా అలుముకుని ఉంటుంది. పర్యాటకులు, బౌద్ధమతస్థులు సందడి తప్ప. ఊరంతా ప్రశాంతంగా, అసలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరా? అన్నట్లు ఉంటుంది. ఈ ప్రాంతంలో పితృదేవతలకు ఎక్కువగా పిండ ప్రధానం చేస్తుంటారు. అలా చేస్తే.. పుణ్యం లభిస్తుందని.. వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం.

ప్రత్యేకం...

గయలో అత్యంత ప్రత్యేకం బోధి చెట్టు. గయ పర్యటనకు వచ్చిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా సందర్శించాలనుకునేది ఈ బౌద్ధ చెట్టు. దీని కింద కూర్చుని ధ్యానించే సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు. అయితే అప్పటి బోధివృక్షం ఇప్పుడు లేదు. దాని తాలూకు మొలకే పెరిగి పెద్దదయి ఇప్పుడు సందర్శకులకు కనువిందు చేస్తుంది. తల్లిచెట్టును మరిపిస్తోంది. బోధివృక్షానికి చెందిన ఓ మొలకను అప్పట్లో అశోకచక్రవర్తి శ్రీలంకకు పంపాడు. బౌద్ధమత ప్రచారానికై అశోకుని కుమారుడు మహేంద్ర శ్రీలంక వెళ్లినప్పుడు, బోధివృక్షం తాలూకు ఒక అంటును కూడా తనతో తీసుకెళ్లాడట. దీన్ని శ్రీలంకలోని అనూరాధాపురలో నాటారు. ఈ మొలకే ఇప్పుడు మహావృక్షమైంది. బుద్ధగయ లోని బోధివృక్షం తల్లిచెట్టు కాల గమనంలో అంతరించిపోతే, అనూరాధాపురలోని పిల్ల చెట్టునుండి మరో అంటును తీసుకొచ్చి బుద్ధగయలో నాటారు. ప్రస్తుతం బుద్ధగయలోని బోధివృక్షం అదే. అసలు వృక్షం నుండి వచ్చింది కాబట్టి దీన్ని కూడా భక్తి శ్రద్ధలతోనే తిలకిస్తూ వుంటారు సందర్శకులు.
 

కేవలం బౌద్ధ వృక్షం మాత్రమేకాదు.. గయలో సందర్శించాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి నిరంజనా నది, మహాబోధి ఆలయం, చంక్రమణ చైత్యం, జమ్మా మసీద్, బరాబర్ గుహలు, దుంగేశ్వరి గుహ ఆలయాలు. వీటన్నింటితోనూ బుద్ధునికి సంబంధం ఉంది. అందుకే గయ వచ్చిన ప్రతి ఒక్కరూ వీటిని కచ్చితంగా సందర్శించాలనుకుంటారు. వీటన్నింటికీ చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

ఎప్పుడు వెళ్లాలి..?

అక్టోబర్‌ నుంచి మార్చి వరకు యాత్రీకుల సీజన్‌ అని చెప్పుకోవచ్చు. ఈ కాలంలోనే ఎక్కువ మంది యాత్రీకులు బుద్ధగయను సందర్శిస్తుంటారు. మే నెలలో యాత్రీకుల రద్దీ పెరుగుతుంది. బుద్ధపూర్ణిమ నాటికి బుద్ధగయ భక్తులతో కిటకిటలాడిపోతుంది. త్రిపిటకములతోఊరు మారుమోగుతుంది.మే నెల తొమ్మిదో తేదీ బుద్ధుడి జన్మదినం. ఈ రోజు కోసం భక్తులంతా ఆతురతతో ఎదురుచూస్తుంటారు. ఆనాటికి బుద్ధగయ చేరుకోవాలని వారంతా ఆరాటపడుతుంటారు.

 

ఎలా వెళ్లాలి..?

విమాన మార్గం.. బుద్ధ గయ కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం గయ విమానాశ్రయం. ఇది 7 కి. మీ. దూరంలో ఉన్నది. అట్లాగే పాట్నా వద్ద మరొక ఏర్‌పోర్ట్ ఉంది ఇక్కడి నుంచి బుద్ధ గయ కి సుమారుగా 135 కి. మీ. దూరం ఉంటుంది. ఇండియన్ ఏర్‌లైన్స్ మరియు సహారా ఏర్‌లైన్స్ విమానాలు కలకత్తా, రాంచీ, లక్నో, ముంబై, ఢిల్లీ తో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విమానాలు నడుపుతుంటారు.

రైలు మార్గం... గయ రైల్వే స్టేషన్ బుద్ధ గయకి దగ్గరలో ఉన్నది. ఇది సుమారుగా 17 కి. మీ. దూరంలో ఉంది. గయ స్టేషన్ కు పాట్నా, కలకత్తా, రాంచీ తదితర ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు మార్గం... బుద్ధ గయకి రోడ్డు వసతి బాగానే ఉంది. ఇక్కడి నుంచి గయ 17 కి. మీ. , నలంద 101 కి. మీ. , రజ్గిర్ 78 కి. మీ. ,పాట్నా 135 కి .మీ. వారణాసి 252 కి. మీ. కలకత్తా 495 కి. మీ. దూరంలో ఉన్నాయి. లోకల్ ట్రాన్స్‌పోర్ట్ ఒకవేళ బుద్ధ గయ చేరుకుంటే ఎలా ప్రయాణించాలనుకుంటే ??ఊళ్లో వివిధ ప్రదేశాలు సందర్శించడానికి టూరిస్టు కార్లు, టాంగాలు, రిక్షాలు దొరుకుతాయి. గైడ్లు కూడా ఉంటారు. బస్సు సదుపాయం ప్రతీరోజు గయ , పాట్నా, నలంద, వారణాసి,రాజ్గీర్ నుండి బస్సులు నడుపుతారు. బీహార్ టూరిజం వాళ్ళు కూడా రోజుకి రెండుసార్లు పాట్నా నుండి బుద్ధ గయకి బస్సులు నడుపుతారు.

 

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గయ చూడటానికి చిన్న పట్టణంగానే ఉన్నా.. పర్యాటకుల వసతికి మాత్రం ఎలాంటి లోటు ఉండదు. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా హోటల్స్, రిసార్ట్స్ చాలానే ఉన్నాయి.