దేవగౌడ వారసత్వాన్ని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పుణికిపుచ్చుకున్నట్లున్నారు. ఆయనలాగే బహిరంగ సభలో కునికిపాట్లు పడుతున్నారు. అయితే ఓ సభలో సీఎం నిద్రపోతున్న వేళ ఇలా అనుకోని ఘటన జరిగింది... అది ఓ జర్నలిస్టు చేతిలో పడింది.
కర్నాటక సీఎం సిద్ధరామయ్య బహిరంగ సభల్లోనే కాదు ఈ మధ్య అసెంబ్లీ సమావేశాల్లోనూ కాసేపు కునుకుతీస్తున్నారు.
ఈ కునుకుపాట్లు మీడియా కంటపడటంతో కాంగ్రెస్ నేతలు కాస్త ఇరకాటంలో పడుతున్నారు. అందుకే ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి పార్టీ నేతలు ఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చారు.
సీఎం ఏదైనా సమావేశంలో నిద్రలోకి జారుకుంటున్నట్లు కనిపిస్తే వెంటనే కొందరు కాంగ్రెస్ ముఖ్యులు ఆయనకు ఓ స్లిప్ పై ఓ సందేశం రాసిపంపుతున్నారు. దీంతో ఆయన వెంటనే మేల్కొంటున్నారు.
మొన్న బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో సీఎం సిద్ధరామయ్య నిద్రలోకి జారుకోవడం చూసి
కేపీసీసీ వుమెన్స్ వింగ్ అధ్యక్షురాలు లక్ష్మీ వెంటనే అప్రమత్తమయ్యారు. ‘Please Alert C.M Sir Sleepy’ అని ఓ స్లిప్ పై రాసి సీఎం పక్కన ఉన్నవాళ్లకు పంపించారు.
అయితే అది సీఎం సన్నిహితుల వద్దకు చేరకముందే ఓ జర్నలిస్టు తన కెమెరాలో ఆ స్లిప్ ను బంధించారు.
ఇప్పుడు ఆ స్లిప్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కాగా, సీఎం సిద్ధరామయ్య స్లీప్ అప్నియాతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ రుగ్మతనుంచి బయటపడేందుకు ఆయన యోగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారట.
