ఆదివారం మోదీ 68వ పుట్టిన రోజు మోదీ పుట్టిన రోజు సందర్భంగా రాయలసీమ రైతుల వింత కానుక

ప్రధాని నరేంద్రమోదీకి రాయలసీమ రైతులు ఓ వినూత్న కానుకను అందిస్తున్నారు. ఆదివారం ( సెప్టెంబర్ 17) నరేంద్రమోదీ 68వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమలోని కొందరు రైతులు ప్రత్యేకంగా ఒక పుట్టిన రోజు కానుకను పంపిస్తున్నారు. 68వ పుట్టిన రోజు కనుక ఒక్కో రైతు 68 పైసలతో చెక్కులను ఆయనకు పంపుతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా పంటలు పండక, ఆదాయం లేక అప్పులతో బాధలు పడుతున్న తమ రాయలసీమ ప్రజలను, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందుకే.. మోదీకి ఇలాంటి బహుమతి పంపుతున్నట్లు రైతులు తెలిపారు.

ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలోని 400మంది రైతుల దగ్గర నుంచి ఈ చెక్ లను సేకరించామని.. రాయలసీమలోని మరో మూడు జిల్లాల్లోని రైతుల వద్ద నుంచి కూడా ఇదేవిధంగా చెక్కులు సేకరించి ప్రధానికి పంపుతామని రాయలసీమ సాగునీటి సాధన సమితి నేతలు, బొజ్జా ధశరాథ రామిరెడ్డి, సుధాకర్ రావు తెలిపారు.

తమ రాయలసీమ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా.. తమను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అందుకే వినూత్నంగా ఈ నిరసన చేపట్టినట్లు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు వై ఎన్ రెడ్డి తెలిపారు.

తమ ప్రాంతానికి ఎన్నో మంచి నీటి ప్రాజెక్టులు తీసుకవస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని.. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో ఇండస్ట్రీలు రాలేదు, నీరు రాలేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంటు, గుంతకల్లులో రైల్వే జోన్ నిర్మిస్తామన్నారు.. కానీ వాటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదన్నారు.

అయినప్పటకీ తమకు ప్రధాని నరేంద్రమోదీ అంటే గౌరవం ఉందని.. ఆయనకు తాము పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈ విధంగా తెలుపుతున్నామన్నారు. మహాభారతంలోని కృష్ణుడి మిత్రుడు కుచేలుడితో వారిని వారు పోల్చుకున్నారు. తమ బాధను మోదీ అర్థం చేసుకుంటారని తాము ఆశిస్తున్నామని , తమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.