భారతీయుల కల నెరవేరింది. బ్మాడ్మింటన్ క్రిడాకారిణి పీవీ సింధు..  కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ఫైనల్ లో విజయం సాధించింది. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో సాగిన హోరాహోరీ పోరులో విజయం పీవీ సింధుని వరించింది.

తొలి సెట్ ను 22-20 తేడాతో గెలిచిన పీవీ సింధు, రెండో సెట్ ను 11-21 తేడాతో ఓడిపోయి, కీలకమైన మూడో సెట్ లో పుంజుకుంది. నిర్ణయాత్మకమైన మూడో సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ, ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వని సింధూ, మూడో సెట్ ను 21-18 తేడాతో గెలిచింది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో అద్భుతంగా పోరాడిన సింధుకు తృటిలో స్వర్ణం చేజారిన విషయం తెలిసిందే. ఆ ఫైనల్లో సింధును ఓడించి ఒకుహర ఛాంపియన్‌ అయ్యింది. అయితే శనివారం జరిగిన కొరియా ఓపెన్‌ సెమీఫైనల్లో సింధు గెలుపొందింది. మరో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌-2 యమగూచిని ఓడించి జపాన్‌ క్రీడాకారిణి నొజోమి ఒకుహర ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో మరోసారి వీరిద్దరికి టైటిల్‌ పోరు పడింది. ఆదివారం ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఫైనల్‌లో సింధు విజయం సాధించింది.


ఆరంభం నుంచే ఒకుహర దూకుడు ప్రదర్శించగా.. సింధు కూడా దీటుగా బదులిచ్చి 22-20తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. అయితే తొలి గేమ్‌లో ఆధిక్యం ప్రదర్శించిన సింధు.. రెండో గేమ్‌లో  కాస్త తడబడింది. ఒకుహర విజృంభించడంతో సింధు తేలిపోయింది. దీంతో 11-21తో రెండో గేమ్‌ను కోల్పోయింది. ఇక డిసైడ్‌ చేసే మూడో గేమ్‌లో  సింధు మళ్లీ పుంజుకుని 21-18తో టైటిల్‌ను దక్కించుకుంది. కాగా.. కొరియా ఓపెన్‌ టైటిల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.
మ్యాచ్ అనంతరం ఒకుహరా, సింధూకు అభినందనలు తెలిపింది. ఈ మ్యాచ్ ఒక గంటా 23 నిమిషాల పాటు సాగింది. సింధు విజయం పట్ల క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.