దేవతామూర్తులు.. ఎవరైనా మనకు ఆలయాల్లో పట్టుచీరల్లోనే దర్శనమిస్తారు. పండగల వేళ.. అమ్మవారి విగ్రహాలను వివిధ రూపాల్లో అలంకరిస్తారు. రూపాలు, ఆభరణాలు, చీర రంగులు మారినా.. దేవతలు మాత్రం చీరల్లోనే దర్శనమిస్తారు. అంతెందుకు సినిమాల్లోనూ దేవతామూర్తులను అంతే చూపిస్తారు. కానీ.. ఒక ప్రాంతంలో మాత్రం అమ్మవారికి  పంజాబీ డ్రస్ వేశారు. దీంతో ఆగ్రహించిన పాలకవర్గం.. ఇద్దరు పూజారును విధుల నుంచి బహిష్కరించింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లా మయిలదుతురై‌లో మయురనాథర్ ఆలయంలో అభయ అంభికా అమ్మాళ్ కొలువై ఉన్నారు. అమ్మవారి విగ్రహానికి ఉన్న చందన తొడుగును ప్రతి శుక్రవారం తొలగించి గులాబీ రంగు పేపర్‌తో కప్పి ఉంచుతారు. అయితే గత శుక్రవారం ఆలయ అర్చకుడు రాజ్ అమ్మవారికి గులాబీ రంగు సల్వార్ కమీజ్ వేశారు. నీలం రంగు దుపట్టాను కప్పారు. అమ్మవారు సల్వార్ కమీజ్‌లో దర్శనమివ్వడంతో అపచారం జరిగిపోయిందంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు అమ్మవారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం మరింత సీరియస్‌గా మారింది.

దీంతో ఈ విషయాన్ని ఆలయ పాలక మండలి ‘తిరువన్నైధురై ఆధీనం’ చాలా సీరియస్‌గా తీసుకుంది. రాజ్‌తో పాటు అతని తండ్రి, సీనియర్ అర్చకుడు కళ్యాణంను విధులు నుంచి తొలగించింది. రాజ్ కిందటేడాది ఆగస్టులో అర్చకుడిగా విధుల్లో చేరాడు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఇంత గొప్ప ఆలయంలో ఇలాంటి చర్యలు క్షమించరానివని ఆలయ అడ్మినిస్ట్రేటర్ ఎస్.గణేశన్ అన్నారు. తప్పుజరిగిందని ఆ ఇద్దరు అర్చకులు ఒప్పుకున్నప్పటికీ ఇది క్షమించరానిదని చెప్పారు. ఆగమ శాస్త్రాలను, హిందూ సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇద్దరు అర్చకులను విధుల నుంచి తొలగించామన్నారు.