శనివారం ఉదయం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

శనివారం ఉదయం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆయన సతీమణి శ్రీమతి సవితాకోవింద్‌, కుమారుడు శ్రీ ప్రశాంత్‌ కుమార్‌, కుమార్తె కుమారి స్వాతి, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు అమరనాథరెడ్డి, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు తదితరులు ఉన్నారు.

రాష్ట్రపతి శనివారం ఉదయం 7.00 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీ వరహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆయనకు తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు, రాష్ట్ర డిఐజీ ప్రభాకర్‌రావు, టిటిడి సివిఎస్వో ఎ.రవికృష్ణ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో కె.ఎస్‌. శ్రీనివాసరాజు సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్‌” ఆలయ మర్యాదలతో ఆగమోక్తంగా స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన ఎ.వి.రమణదీక్షితులు శ్రీవారి ఆలయ ప్రశస్త్యాన్ని, సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి వివరించారు.

అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈవో, జెఈవోలు కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌, గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్దజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ తిరుమల చిన్నజీయంగార్‌ స్వామి, జిల్లా కలెక్టర్‌ ప్రదుమ్న, తిరుపతి అర్బన్‌ ఎస్‌పి అభిషేక్‌ మహంతి, డెప్యూటీ ఈవోలు కోదండరామరావు, హరీంద్రనాథ్‌, ఒఎస్‌డి లక్ష్మీనారయణ యాదవ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి