పరిశోధనా పత్రాల ప్రచురణలో అంతర్జాతీయ సగటు ప్రగతి నాలుగు శాతం ఉంటే, భారత దేశం 14 శాతంతో ముందుకు దూసుకుపోతూ ఉంది.
భారతీయ శాస్త్ర సాంకేతిక పరిశోధనలు ప్రపంచస్థాయికి చేరుకుంటున్నాయని, 2030 నాటికి భారత్ మేటి మూడు దేశాలలో ఒకటిగా నిలబడుతుందని ప్రధాని నరేంద్రమోడి ఆశాభావం వ్యక్తం చేశారు.
మంగళవారం నాడు తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోషియేన్ (ఇస్కా) 104వ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన భారతీయ శాస్త్రవేత్తలను అభినందించారు.
భారతదేశం పరిశోధనా పత్రాల ప్రచరణలో ఇపుడు ప్రపంచంలో అరో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. ‘పరిశోధనా పత్రాల ప్రచురణలో అంతర్జాతీయ సగటు ప్రగతి నాలుగు శాతం ఉంటే, భారత దేశం 14 శాతంతో ముందుకు దూసుకుపోతూ ఉంది. ఈ లెక్కన 2030 నాటికి శాస్త్ర సాంకేతిక రంగాలలో మూడు అగ్రదేశాలలో భారత్ ఒకటవుతుంది,’ అని ప్రధాని చెప్పారు.
వ్యాపారంలో సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) లాగానే శాస్త్ర రంగంలో ఈజ్ ఆప్ డూయింగ్ సైన్స్ అవసరమని ఆయన చెప్పారు.
మరొక కొత్త ప్రతిపాదన చేస్తూ, కార్పొరేట్ రంగంలో వస్తున్న సోషల్ రెస్పాన్సిబిలిటి శాస్త్ర పరిశోథనా సంస్థలకు కూడా విస్తరింపచేయాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికోసం పాఠశాలతో పరిశోధనా సంస్థలు కలసిపనిచేస్తూ వారిలో పరిశోధన ఉత్సుకతను పెంపొందింపచేయాలని అన్నారు.
ఎన్నారై పీహెచ్‌డీ విద్యార్థుల సేవలు ఉపయోగించుకోవాలని, విదేశీ యూనివర్సిటీలు, ఐఐటీలు కలిసి పనిచేయాలన్నారు. సమ్మిళిత అభివృద్ధి కోసం పరిశోధన-అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలని ప్రధాని సూచించారు. పట్టణ-గ్రామీణ అంతరాలను పూడ్చేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు.
పెద్దనగరాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్‌లు ఏర్పాటు చేయాలని మోదీ అభిప్రాయపడ్డారు. 2016 నవంబర్‌లో భారత దేశం ప్రముఖ శాస్త్రవేత్త, అనేక పరిశోధనా సంస్థలను నెలకొల్పడంలో కీలకపాత్ర వహంచిన ఎంజికె మీనన్‌ను కోల్పోయిందని అన్నారు.
ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాల తీర్చేలా ప్రపంచ ప్రమాణాలకు తగినట్లుగా పరిశోధనలు జరగాలని మోదీ కోరారు. విధ్వంసాలకు టెక్నాలజీని ఉపయోగించడం పట్ల అప్రమత్తంగా కూడా ఉండాలని హచ్చరించారు.
సమావేశంలో గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన 400మంది సైంటిస్టులు హాజరయ్యారు.
