వాహనదారులకు ఊహించని భారీ షాక్ తగిలింది. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. శుక్రవారం డీజిల్‌ ధర ఆల్‌ టైం గరిష్ఠానికి చేరింది. దిల్లీలో ఈరోజు లీటర్‌ డీజిల్‌ ధర రూ.65.31గా ఉంది. కోల్‌కతాలో రూ.68.01గా, ముంబయిలో రూ.69.54గా, చెన్నైలో రూ.68.9గా ఉంది. పెట్రోల్‌ ధర కూడా 55 నెలల గరిష్ఠానికి చేరింది. ఇండియన్‌ ఆయిల్‌ వెబ్‌సైట్‌ ప్రకారం దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.74.08గా ఉంది. 2013 సెప్టెంబర్‌  తర్వాత ఇదే అత్యధిక ధర.

ఈ ఏడాది మార్చి నుంచి  ప్రముఖ నగరాల్లో పెట్రోల్‌ ధర 50పైసలకు పైగా, డీజిల్‌ ధర 90పైసలకు పైగా పెరిగింది. ఏడాది ప్రారంభంలోనూ ప్రముఖ నగరాల్లో పెట్రోల్‌ ధర రూ.4కు పైగా, డీజిల్‌ ధర రూ.5-6 మధ్యలో పెరిగింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ గత ఏడాది జూన్‌లో పదిహేను రోజులకోసారి ధరలు మార్చే విధానాన్ని తీసేసి ప్రతి రోజూ ధరలు మారే విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంతో ధరల మార్పు ప్రభావం వెంటనే చూపిస్తోంది.

ఆదివారం దిల్లీలో పెట్రోల్‌ ధర రూ.73.73తో నాలుగేళ్ల గరిష్ఠానికి చేరగా, డీజిల్‌ ధర రూ.64.58పైసలతో ఆల్‌ టైం గరిష్ఠానికి చేరింది. ధరలు బాగా పెరుగుతుండడంతో ప్రభుత్వం ఎక్సైజ్‌ పన్నులు తగ్గించాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు. దక్షిణాసియా దేశాల్లో భారత్‌లోనే పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలు అధికంగా ఉన్నాయి.