పాకిస్థాన్ క్రికెటర్ల పై చేతబడి జరిగిందా..? అందుకే పాక్ టీం అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఓడిపోయారా..? పాక్ టీం మేనేజర్ నదీమ్ ఖాన్ అదే సమాధానం ఇస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీని యువ భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో పోటీపడిన టీం ఇండియా.. సెమీ ఫైనల్స్ లో పాకిస్థాన్ తో తలపడింది.

ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో పాక్.. భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. కేవలం 69 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. దీంతో 203 పరుగుల తేడాతో పాక్ పై టీం ఇండియా ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ లో పాక్ ఓడిపోవడానికి కారణమేంటని మీడియా పాకిస్థాన్ టీం మేనేజర్ ని ప్రశ్నించగా.. ఎవరూ ఊహించని సమాధానం చెప్పి షాకిచ్చాడు.  తమ ప్లేయర్స్‌ పై చేతబడి జరిగిందని, అందుకే ఓడిపోయామని అభిమానులు జీర్ణించుకోలేని ఓ వింత థియరీని అతను తెరపైకి తీసుకొచ్చాడు. ‘‘మేం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అనుకున్నాం. కానీ మ్యాచ్ గడిచే కొద్దీ.. మా బ్యాటింగ్ కుప్పకూలింది. కేవలం 69 పరుగులకే కుప్పకూలాం. ఆ దశలో మావాళ్లపై ఏదైనా చేతబడి జరిగిందా అన్న అనుమానం కలిగింది’’ అని నదీమ్ ఖాన్ అన్నాడు. ఆ పరిస్థితుల్లో అసలు ఫీల్డ్‌ లో ఏం జరుగుతుందో తెలియక, ఒత్తిడిని తట్టుకోలేక తమ బ్యాట్స్‌ మెన్ చేతులెత్తేశారని నదీమ్ చెప్పాడు.