సూర్యుడు, చంద్రుడు ఎవరు గొప్ప అంటే ఏం చెబుతాం.. దేశానికి గాంధీ, అంబేద్కర్ కూడా అలాంటి వారే. ఇద్దరినీ ఒకరితో ఒకరు పోల్చడం అంటే మన దేశ ఔనత్యాన్ని మనమే తగ్గించుకోవడం లాంటిది. ముఖ్యంగా రాజ్యాంగ రూపశిల్పిగా, ప్రపంచం మెచ్చిన గొప్ప మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ ను కేవలం ఒక కులనాయకుడిగా నేటి రాజకీయనేతలు చిత్రీకరించడం వారి అవకాశవాదానికి పరాకాష్ట.

కులం, మతం అనే రెండు పెద్ద ప్రచార అస్త్రాలుండగా ఇంకా అభివృద్ధి, సమానత్వం, సమ్మిళిత వృద్ధి లాంటి అర్థంకాని వ్యర్థ పదాలతో ఓట్లను అడగడం వృథా.

ఆకలి తీర్చే పథకాలకన్నా... ఐక్యమత్యాన్ని ప్రశ్నించే పథకాలకే ఈ దేశంలో ఎక్కువ ఓట్లు పడుతాయి. ప్రజల్లో ఉన్న ఈ సహజ లక్షణాన్ని గ్రహించే చాలా పార్టీలు జనాలను కులం, మతం, ప్రాంతం పేరుతో విభజిస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారు.

ఈ కేటగిరిలో ఉండే వ్యక్తుల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒకరు. అవకాశం వచ్చినప్పుడు ముఖ్యంగా ఓట్లు అడిగే అవకాశం వచ్చినప్పుడు ఆయనలోని అపారమైన మేధావితనం ఒక్కసారిగా బయటపడుతుంది.

కానీ, పాపం కొన్ని రాష్ట్రాలు ఆయనలోని మేధావి వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేక తమ రాష్ట్రానికి రాకుండా నిషేధం కూడా విధించాయి.

నిన్న హజ్ సబ్సిడీని తీసివేయాలని సంచలన ప్రకటన చేసి వార్తలకెక్కిన అసద్ ఇప్పుడు మరో వ్యాఖ్య చేసి రసవత్తర చర్చకు దారితీశారు.

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న దళితులను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు అంబేద్కర్ నుంచి ఆవు మాసం వరకు దేన్నీ వదలడం లేదు.

ఇక అక్కడ కూడా పార్టీ జెండా పాతాలని తెగప్రయత్నిస్తున్న అసద్ కూడా ఇప్పుడు దళితులను ఆకర్షించేందుకు సడెన్ గా అంబేద్కర్ అవసరమయ్యాడు.

ఏలాగూ మైనారిటీల నేతగా దేశమంతా గుర్తింపు ఉండనే ఉంది. ఇక దళితులను ఆకర్షించాలంటే అంబేద్కర్ జపం చేయాలి.

అందుకే గాంధీ కంటే అంబేద్కరే చాలా గొప్పవాడని తీర్మానించారు అసద్ భాయ్. ఈ వ్యాఖ్యలతో మైనారిటీలతో సహా దళితుల ఓట్లను కొల్లగొట్టవచ్చనేది ఆయన వ్యూహం. ఆయనే కాదు కాస్త మేధావి తనం ప్రదర్శించే కమలనాథుల ఎజెండా కూడా ఇదే.