క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ పేరు మీదుగా నకిలీ ట్విటర్‌ ఖాతా నడుపుతున్న వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొంతకాలంగా ఆ ట్విట్టర్ ఖాతా నుంచి అభ్యంతకర పోస్టులు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని అంధేరికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ నితిన్‌ సిశోడే(39) సారా పేరు మీదుగా నకిలీ ఖాతా నడుపుతున్నాడు. దాని ద్వారా కొందరు రాజకీయ నాయకులను కించపరిచేలా పోస్టులు పెడుతున్నాడు. కాగా.. అది సారా నకిలీ ట్విట్టర్ ఖాతాగా గుర్తించిన సచిన్.. దీనిపై సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.

సచిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అతనిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్‌, రెండు మొబైల్‌ ఫోన్లు, రూటర్‌, ఇతర కంప్యూటర్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై చీటింగ్, పరువు నష్టం తదితర కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా ఫిబ్రవరి 9వ తేదీ వరకు పోలీస్‌ కస్టడీ విధించారు.