కాంగ్రెసుతో పొత్తుకు నో, కానీ.....: గెలిచిన సీతారాం ఏచూరి

Not have alliance with Cong, but understanding: Sitaram Yechury
Highlights

కాంగ్రెసుతో పొత్తుకు నో, కానీ.....: గెలిచిన సీతారాం ఏచూరి

హైదరాబాద్: బిజెపిని ఎదుర్కోవడానికి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవాలనే సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి సీతారాం ఆలోచనలో కాస్తా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెసుతో అనుసరించబోయే వైఖరిపై ఆయన ఆదివారం హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసుతో పొత్తు ఉండదు గానీ అవగాహన ఉంటుందని ఆయన చెప్పారు. 

కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవాలనే సీతారాం ఏచూరి ప్రతిపాదనను గతంలో పార్టీ కేంద్ర కమిటీ తోసిపుచ్చింది. బిజెపిని ఓడించాలంటే కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడం అవసరమని ఆయన వాదిస్తూ వచ్చారు. తన ప్రతిపాదన వీగిపోవడంతో పార్టీ పదవికి రాజీనామా చేయడానికి కూడా ఆయన సిద్ధపడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

సీతారాం ఏచూరి ప్రతిపాదనను ప్రకాశ్ కారత్ వ్యతిరేకిస్తూ వచ్చారు. కొత్తగా ఎన్నికైన కేంద్ర కమిటీలో కూడా ప్రకాశ్ కారత్ వర్గానికి చెందినవారే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కాంగ్రెసు ప్రధాన కార్యదర్శిని మార్చాలనే చర్చ కూడా సాగినట్లు తెలుస్తోంది.

పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి బృందా కారత్, మాణిక్ సర్కార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బివి రాఘవులు పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే, ప్రధాన కార్యదర్శిని మారిస్తే క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆలోచనతో సీతారాం ఏచూరిని రెండోసారి కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

తాను ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికైన తర్వాత ఏచూరి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు వెలుపలా, లోపలా మతతత్వ శక్తులను ఎదుర్కోవడానికి కాంగ్రెసుతో అవగాహన ఉంటుందని ఆయన చెప్పారు. 

రాష్ట్రాల క్షేత్ర వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల వ్యూహాత్మక పంథాను ఖరారు చేస్తామని సీతారాం ఏచూరి చెప్పారు. 

కాంగ్రెసుతో అవగాహన చేసుకోకూడదని హైదరాబాదులో జరిగిన మహాసభల్లో శనివారం పార్టీ నాయకత్వం అధికారిక ముసాయిదాను ప్రవేశపెట్టింది. అయితే, కాంగ్రెసుతో అవగాహన ఉండదనే అంశాన్ని తొలగించి ముసాయిదాను ఆమోదించారు. దీంతో ఏచూరి నాయకత్వంలోని మైనారిటీ అభిప్రాయం నెగ్గింది. 

కాంగ్రెసుతో అవగాహన, ఎన్నికల పొత్తు పెట్టుకోకుండా లౌకిక ప్రజాతంత్ర శక్తులను ఏకం చేయాలనే ప్రకాశ్ కారత్ బలపరిచిన అధికారిక ముసాయిదా తీర్మానంలో ప్రతిపాదించారు. దాన్ని సవరించి, కాంగ్రెసుతో రాజకీయపరమైన పొత్తు లేకుండా ప్రజాతంత్ర, లౌకిక శక్తులను ఏకం చేయాలని మార్చి ఆమోదించారు. 

loader