మిషన్ భగీరథ పనుల్ని పరిశీలించిన కవిత అనుకున్న సమయానికే భగీరథ పనులు పూర్తి

మిషన్ భగీరథ వంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, దీన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. ఇవాళ ఆమె నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆర్గుల్ గ్రామంలో నిర్మితమవుతున్న మిషన్ భగీరథ పంప్ హౌజ్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్,ఫిల్టర్ బెడ్ పనులను పరిశీలించారు. ఆమె వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఇంచార్జ్ కలెక్టర్ రవీందర్ రెడ్డి ఉన్నారు.

ఈ సంధర్బంగా ఎంపి కవిత మాట్లాడుతూ ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు వేగవంతం గా సాగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయం మేరకు అనుకున్న టైంలోనే నీరందిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న విధంగానే టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని కవిత అన్నారు.
ఆర్గుల్ ట్రీట్ మెంట్ ప్లాంటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు సురక్షిత తాగునీటిని అందిస్తుందని కవిత తెలిపారు.
