మనిషి శరీరంలో ఒక  కొత్త అవయవం బయటపడింది. ఈ బ్రాండ్ న్యూ అవయవం ఇంకా గూగుల్ సెర్చ్ కు కూడా అందనంత కొత్త అవిష్కరణ. దీని పేరు మిసెంటెరి.

సుదూరాకాశంలో కొత్త గ్రహాలు, పాలపుంతలు కనిపెడతూ ఉండటం చూస్తున్నాం. అదే విధంగా కొత్త మూలకాలను కనిపెడుతూ ఉండటం చదువుతున్నాం. సముద్రం లోతుల్లో ఏమి దొరుకుతున్నదో కనిపెడుతున్నారు. వెలికితీస్తున్నారు. ఇంత చేస్తున్న శాస్త్రవేత్తలకు అతి చేరువలో ఉన్న ఒక విషయాన్ని కనుగొనలేకపోయారు. ఈ విషయం గురించి అయిదువందల సంవత్సరాల కిందటే లియనార్డో డా విన్సి అనుమానం వ్యక్తం చేసినా, డాక్టర్ల చూపు అటువైపు వెళ్ల లేదు.

అయితే, ఇపుడు మన శరీరంలోని జీర్ణ వ్యవస్థలో ఇంతవరకు నక్కి ఉండి, డాక్టర్ల కంటపడకుండా తప్పించుకున్న ఒక అవయవాన్ని కనిపెట్టారు. దీనితో మానవ శరీరంలోని అవయమావల సంఖ్య 79కి చేరుకుంది.

ఈ కొత్త అవయవం పేరు మిసెంటరి( mesentery). ఇంతవరకు ఈ శరీర భాగాన్ని జీర్ణ వ్యవస్థలోని ఒక భాగంగానే చూస్తూ వచ్చారు తప్ప మరొక ఆలోచన ఎవరికి తట్టలేదు. చివరకు, యూనివర్సిటీ ఆప్ లిమరిక్ (ఐర్లండ్) పరిశోధకుడు క్యాల్విన్ కోఫే ఇది ఒక స్వతంత్ర అవయవం అని ఆధారాలు చూపించాడు. 2012 నుంచి ఆయన మిసెంటరి మీద చేసిన పరిశోధనలు ఇపుడు ‘The Lancet’ మెడికల్ జర్నల్ ప్రచరితమయ్యాయి.

మిసెంటరీ చేసే పని మీద ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే, ఈ ఆవిష్కరణతో మానవ శరీరానికి సంబంధించి ఒక కొత్త శరీరాయవ శాస్త్రం యుగం మొదలవుతుందని ఆయన అంటున్నారు.

‘ఇపుడు దీనిని ఇతర అన్ని శరీరావయవాల లాగా చూడాల్సి వస్తుంది. ఇకనుంచి అబ్డామినల్ జబ్బుల గురించి మాట్లాడేటపుడు ఈ అవయవాన్ని దృష్టిలోపెట్టుకోవలసి వస్తుంది,’ డాక్డర్ క్యాల్విన్ అన్నారు.

ఇప్పటికయితే, మిసెంటరి , అంతర్గత నిర్మాణం పూర్తిగా అర్థమయింది. తదుపరి దశ లో ఈ అవయవం చేస్తున్న పనేమిటో కనుక్కోవాలి. ఇది చేసే పనేమిటో తెలిస్తే దాని అనర్థాలు కూడా అర్థమవుతాయి. అపుడే దీనికి సంబంధించిన జబ్బులు అర్థమవుతాయని అయనచెబుతున్నారు.

ఇవన్నీ కలిపితే,మిసెంటెరిక్ సైన్స్ అవుతుందని అంటున్నారు.

ఈ అవిష్కరణ తర్వాత వైద్య విద్యార్థులకు మిసెంటరీ గురించి బోధించడం కూడా మొదలయిందట. ఎందుకంటే, వందేళ్లు మనం బోధిస్తూ వచ్చిన అనాటమీ లో తప్పులున్నాయని ఈ పరిశోధన చెప్పిందని అయన అన్నారు.

వైద్య పాఠ్య పుస్తకం గ్రేస్ అనాటమీ లోకి కూడా మిసెంటెరి ఎక్కింది.

ఈ వార్త రాస్తున్నపుడు గూగుల్ సెర్చ్ చేస్తే కేవలం 1310 ఎంట్రీలు మాత్రమే దొర్లాయి. అవేవీ సైన్స్ సంబంధించనవి కాదు.

మిసెంటెరి అంటే: శరీరకుహరం (అబ్డామెన్ )లో అవయవాలన్నింటిని వాటి వాటిస్థానంలో అతికించిపెట్టే పొర ఒకటుంటుంది. దానిని పెరిటోనియం అంటారు. మిసెంటరీ రెండుమందమయిన పొరల పెరిటోనియం. లియోనార్డో డా విన్సి దీని గురించిప్రస్తావించినా అవిఇతర అవయవాల చీలికలుగా భావించి డాక్టర్లు దానిని పట్టించుకోలేదు. దీనితో ఇది అప్పటినుంచి ఇప్పటిదాకా మరుగున పడివుండింది. ఎన్ని అనర్థాలు తీసుకువచ్చిందోతెలియదు.