ఆ తల్లీ కన్న బిడ్డలను పెంచి పెద్దచేసి ప్రయోజకులను చేసింది. వారు పెద్దవారయ్యాక పెద్దల ఆస్తులను పంచుకున్నారు. అంతస్తులను పంచుకున్నారు. పెళ్లిళ్లు చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. కానీ తాను తినీ తినక పిల్లల ఆకలి తీర్చి, రెక్కలు ముక్కలు చేసుకున్న పోషించిన తల్లి బాగోగులను మాత్రం మరిచిపోయారు. దీంతో పిల్లలకు భారంగా మారలేక, వారి  ప్రేమకు దూరంగా ఉంటూ బ్రతకలేక 90 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు ప్రయత్నించింది. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా మాడ్గులపల్లికి చెందిన రేల లింగమ్మ(90)కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వీల్లు పుట్టిన కొన్నేళ్లకే భర్త జంగయ్య చనిపోయాడు. దీంతో ఆ తల్లి కాయ కష్టం చేసి బిడ్డలను పోషించడంతో పాటు 12 ఎకరాల భూమిని సంపాదించింది. కుమారులు భిక్షంరెడ్డి, వెంకట రెడ్డి, సత్తిరెడ్డి లకు వివాహం చేసి ఆస్తులు మొత్తాన్ని సమానంగా పంచింది. అయితే అక్కడే అమ్మకు కష్టాలు మొదలయ్యాయి. తన వద్ద ఎలాంటి ఆస్తి పాస్తులు ఉంచుకోకుండా అంతా పిల్లలకే పంచడంతో ఆమె అవసరం తీరిపోయిందనుకున్న కుమారులు, ఆమె ఆలన పాలనను మరిచారు. ఆకలితో అలమటిస్తున్న తల్లి కి కనీసం అన్నం పెట్టేందుకు కూడా కుమారులు ముందుకు రాలేరు. దీంతో దిక్కులేక ఆ తల్లి కలతచెందింది. 

ఇక ఎలాగూ కుమారులు కరునించరని అర్థమై చనిపోవడమే తన సమస్యకు పరిష్కారమని భావించింది. దీంతో మాడ్గులపల్లిలోని నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ వద్దకు చేరుకున్న ఈ వృద్దరాలు కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించింది. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని లింగమ్మను స్టేషన్‌కు తరలించారు.