బెడిసి కొడుతున్న సిద్ధాంతం

Naidu two eye theory becomes hurdle
Highlights

రెండు కళ్ళ సిద్ధాంతం తెలంగాణాలో బాగా ఇబ్బంది పెడుతోంది.

 

ఒకానొక్కపుడు చంద్రబాబునాయుడు తొదరపడి ప్రవచించిన రెండు కళ్ళ సిద్ధాంతం తెలంగాణాలో బాగా ఇబ్బంది పెడుతోంది. రైతు రుణమాఫీ కావచ్చు, ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటు కావచ్చు. చివరకు అసెంబ్లీలో టిడిపికి మాట్లాడే అవకాశం ఇవ్వటంలో కూడా కావచ్చు. ఇలా ఎందులో చూసినా టిడిపికి ఎదురుదెబ్బలే.

 

తాజాగా అసెంబ్లీలో జరిగన ఓ ఘటనే అందుకు నిదర్శనం. తెలంగాణా అసెంబ్లీలో టిడిపి ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య ప్రవేశపెట్టిన ఓ తీర్మనంపై అధికార టిఆర్ఎస్ ఎంఎల్ఏలు విరుచుకుపడుతున్నారు.

 

తెలంగాణాలో టిడిపి నుండి 15 మంది శాసనసభ్యులు గెలిచారు. అయితే, వివిధ కారణాలతో 12 మంది టిఆర్ఎస్ లో చేరారు. అసెంబ్లీ సమావేశాల్లో వారిపై అనర్హత వేటు విషయం చర్చకు వచ్చింది. పార్టీ ఫిరాయించిన వారిపై తక్షణమే అనర్హత వేటు వేయాలంటూ ఎంఎల్ఏ సండ్ర వెంకట వీరయ్య స్పీకర్ కు నోటీసు ఇచ్చారు.

 

అక్కడే టిడిపికి సమస్య ఎదురైంది. ఎందుకంటే, తెలంగాణాలో ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హతకు డిమాండ్ చేస్తున్న టిడిపి ఏపి విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్న విషయం గమనార్హం. తెలంగాణాలో టిఆర్ఎస్ నుండి టిడిపికి ఎటువంటి అనుభవాలు ఎదురౌతున్నాయో అవే అనుభవాలను అధికార టిడిపి ఏపిలో ప్రతిపక్ష వైసీపీకి రుచిచూపిస్తోంది.

 

చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని  టిఆర్ఎస్ ఎంఎల్ఏలు ప్రస్తావిస్తూ టిడిపి శాసనసభ్యులను ఎకసక్కాలాడుతున్నారు. ఏపిలో వైసీపీ ఎంఎల్ఏల ఫిరాయింపుల విషయాన్ని ప్రస్తావించినపుడు టిడిపి ఎంఎల్ఏలకు ఏమి మాట్లాడాలో అర్ధం కావటం లేదు.

 

అలాగే, తెలంగాణాలో రైతు రుణమాఫీ విధానంపై కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై మాట్లాడాలన్నా టిడిపి సభ్యులకు ఏపిలో జరుగుతున్న తంతు అడ్డం వస్తోంది. ఇక, సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టిడిపి ఎంఎల్ఏలు ఎంత గొంతుచించుకుంటున్నా స్పీకర్ మైక్ ఇవ్వటం లేదు.

 

ఏపిలో కూడా వైసీపీ సభ్యుల విషయంలో స్పీకర్ అదే చేస్తున్నట్లు టిఆర్ఎస్ సభ్యులు ఎదురుదాడి చేస్తున్నారు. దాంతో చంద్రబాబు ఎప్పుడో ప్రవచించిన రెండు కళ్ళ సిద్ధాంతం బాగా ఇబ్బంది పెడుతున్నట్లు రేవంత్ రెడ్డి, సండ్ర వాపోతున్నారు.
 

loader