కాకినాడ ప్రజల మీద చంద్రబాబు అసహనం

First Published 9, Jun 2017, 8:40 AM IST
naidu chided kakinada people for not listening to his mahasankalpam speech
Highlights

కాకినాడ మహాసంకల్పదీక్ష కు ముందు ఆనంద భారతి మైదానంలో ముఖ్యమంత్రి గంట సేపు ధారాళంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి ప్రసంగం మధ్యలో జనంలో కదలిక మొదలయింది. దీనిని గమనించి  ఆయన అసహనం వ్యక్తంచేశారు. ‘గంట సేపు ఉపన్యాసం వినని వాళ్లు జీవితంలో ఏమీ సాధించలేరు,’ అని సూటిపోటి వ్యాఖ్య చేశారు.అయితే, ఎవరూ లేచివెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టంగా అడ్డుకోవడంతో సభ ‘విజయవంతం’గా ముగిసింది.

 

కాకినాడలో రాష్ట్రస్థాయి  మహాసంకల్పంతో ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడి రాష్ట్రావరతరణ లేదా విభజన వ్యతిరేక సంకల్పాలు  భారంగా ముగిశాయి. అయితే,తన ఉపన్యాసం పూర్తిగా వినలేని కాకినాడ ప్రజల మీద బాబుకు బాగటా కోపం వచ్చింది. 

అయినా సరే, సంకల్పాలు అయిపోయాయని అధికారులు వూపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే, ముఖ్యమంత్రి ప్రసంగం , దీక్ష , సంకల్పం అంటే జనం రావడంలేదు.వచ్చిన వాళ్ల ఎక్కువ సేపు కూర్చోవడంలేదు. పోలీసులను చుట్టూర నిలబెట్టినా మధ్యలోనే  లేచిపోతున్నారు.   కాకినాడలో ఇదే జరిగింది.


మొదట చంద్రబాబు 20 నిమిషాల పాటు మహా సంకల్పాన్ని చేయించారు. అది ముగిసిన వెంటనే ఇది రాష్ట్ర సంకల్పం మాత్రమేనని, జిల్లా సంకల్పం చేయించాలి, కూర్చోండి, ఎవరూ వెళ్లవద్దని చెప్పారు. తర్వాత శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం మరొక పది నిమిషాల సమయం తీసుకోవడంతో జనం విసిగిపోయారు. మొదటి సంకల్పం పలికిన వారిలో సగానికి పైగా రెండో సంకల్పాన్ని పలకలేదు. 

మహా సంకల్పం సందర్భంగా  ప్రజాప్రతినిధుల ప్రసంగాలన్నీ బాగా బోర్ కొట్టాయి. ఈ ప్రసంగాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడానికే సరిపోయాయి. 2019 ఎన్నికల్లో గెలవాలని, ప్రజలూ గెలిపించాలని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని ఒకే మూసలో   నేతల పొగడ్తలు సాగాయి. కాకినాడ ఎంపీ తోట నరసింహం చంద్రబాబును ఏకంగా బాహుబలితో పోల్చారు. సిఎం ఎంతో చేశారని మళ్లీ ఆయనకే పట్టం కట్టాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే అనంతలక్ష్మి పిలుపు నిచ్చారు. హోం మంత్రి చినరాజప్ప సంగతి చెప్పనవసరం లేదు,  చంద్రబాబు పాలనను తెగ పొగిడేశారు.

వీళ్లతో పోటీ పడి చంద్రబాబు ను పొగుడ్తున్నారు, ఎన్జీవో నాయకుడు అశోక్ బాబు, మురళీ కృష్ణ. తాము ఉద్యోగుల ప్రతినిధులమనే అంశాన్ని మర్చిపోయి, ఈ సభలో ముఖ్యమంత్రి పొగిడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మధ్య కాలంలో వీళ్ల పొగడ్తలు చూశాక, ముఖ్యమంత్రి కూడా ,వెరైటీ కోసం, వీరద్దరిని కూడా వెంటేసుకుని తిరుగుతున్నారు. అమరావతి కోసం కష్టపడుతున్నచంద్రబాబు నాయుడు జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని అశోక్ బాబు అశిస్తే, అమరావతి అంటేనే అవకాశాలు అని మురళీ కృష్ణ తాళం వేశారు.

కాకినాడ ఆనంద భారతి మైదానంలో జరిగిన ఈ మహాసంకల్పదీక్ష కు ముందు ముఖ్యమంత్రి గంట సేపు ప్రసంగించారు. ముఖ్యమంత్రిప్రసంగం మధ్యలో జనం లో కదలిక మొదలయింది. దీనిని ఆయన గమనించి అసహనం వ్యక్తంచేశారు. ‘గంట సేపు ఉపన్యాసం వినని వాళ్లు జీవితంలో ఏమీ సాధించలేరు,’ అని సూటిపోటి వ్యాఖ్య చేశారు.

అయితే, ఎవరూ లేచి పోకుండా పోలీసులు కట్టుదిట్టంగా అడ్డుకోవడంతో సభ ‘విజయవంతం’గా ముగిసింది.

 

loader