మష్రూమ్స్ లో రెండు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి వయసు ఎక్కువగా కనిపించే కణాలతో యుద్ధం చేస్తాయి. దీంతో యవ్వనంగా కనిపించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.

పుట్టగొడుగులు చూడటానికి బుజ్జిగా భలే ఉంటాయి. చూడడానికే కాదు.. ఇవి తినడానికి కూడా చాలా మంచివి అంటున్నారు నిపుణులు. ఈ మష్రూమ్స్ లో రెండు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.అవి వయసు ఎక్కువగా కనిపించే కణాలతో యుద్ధం చేస్తాయి. దీంతో యవ్వనంగా కనిపించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. కేవలం అందం మాత్రమే కాదు.. ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ మష్రూమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

పెన్ స్టేట్ రీసెర్చర్స్ విభాగం ఈ మష్రూమ్స్ పై పలు రకాల పరిశోధనలు చేశారు. వారి పరిశోధన ప్రకారం మష్రూమ్స్ లో ఎర్గోతియోనీన్,గ్లూటాతియోన్ అనే రెండు రకాల ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని ప్రొఫెసర్ రాబర్ట్ బీల్మన్ చెప్పారు.

మానవ శరీరానికి శక్తి అందించేందుకు ఆహారం తీసుకుంటారు. అలా తీసుకున్న ఆహారం ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేసే సమయలో ఒత్తిడికి గురౌతుందని బీల్మన్ తెలిపారు. ఆ సమయంలో ఉత్పత్తి అయిన రాడికల్స్.. ప్రోటీన్లు,డీఎన్ఏలకు నష్టం కలిగించే ఎలక్ట్రాన్లతో ఆక్సీజన్ అణువులు జతకడతాయి. దానివల్ల వయసు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. వాటిని కంట్రోల్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్.. ఈ మష్రూమ్స్ లో పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి యాంటీ ఏజెనింగ్ గా పనిచేస్తాయి.

అంతేకాదు.. హైబీపీతో పాటు.. రక్తంలో కొవ్వు కరిగించాలంటే వారానికి రెండుసార్లు మష్రూమ్స్ తీసుకోవాల్సిందేనట! ఇతర కూరగాయల నుంచి పొందలేని పోషకాలు మష్రూమ్స్ నుంచి లభిస్తాయి. మష్రూమ్స్‌లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. మష్రూమ్‌లో లెంటిసైన్, ఎరిటడెనిన్ అనేవి రక్తంలో కలిసిపోయిన కొవ్వును కరిగేలా చేస్తుంది. అంతేకాదు.. కరిగిన కొవ్వును ఇతర భాగాలకు పంపి, శరీరానికి ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది. గుండె జబ్బులకు కూడా మష్రూమ్ మంచి మందు. ఇందులో ఉండే పొటాషియం, సోడియం.. గర్భ సంబంధిత రోగాలు, మోకాలి నొప్పులు రాకుండా చేస్తుంది. రోజూ మష్రూమ్స్ సూప్ తీసుకునే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నియంత్రించవచ్చునని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది.