ధోనీ క్రికెట్ కెరీర్ అచ్చం అతడి హెలికాప్టర్ షాట్ లానే కొనసాగింది. అమాంతంగా రథసారధి అయ్యాడు... ఆకస్మికంగా పగ్గాలు వదిలేశాడు.

కెప్టెన్ కూల్ నుంచి ధోనీ ఇక మిస్టర్ కూల్ గా మారిపోయాడు. భారత క్రికెట్ రథసారధిగా చిరస్మరణీయ విజయాలందించిన ఈ జార్ఘండ్ డైనమెట్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది.

అయితే ఇంగ్లండ్‑తో వన్డేలు, టీ20 మ్యాచ్‑లకు ధోనీ ఓ ఆటగాడిగా మాత్రం అందుబాటులో ఉండనున్నాడు. ఇక వన్డే పగ్గాలను కూడా విరాట్ కొహ్లీ చేపట్టనున్నాడు.

వికెట్ కీపర్ గా జట్టులో అడుగుపెట్టిన ధోనీ నిజంగా హెలీకాప్టర్ గా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. గతంలో ఏ కెప్టెన్ అందుకోని చిరస్మరణీయ విజయాలను అందుకున్నాడు.

బ్యాటింగ్ లో కళాత్మకత, క్రికెటింగ్ షాట్ లు పెద్దగా లేకపోయినా తనదైన శైలీలో ఆడుతూ జట్టుకు వెన్నుముకలా నిలిచాడు.

ఉత్కంఠభరిత మ్యాచ్ లో కూడా చాలా కూల్ గా నిర్ణయాలు తీసుకోవడం ధోనీ ప్రత్యేకత. అందుకే కెప్టెన్ కూల్ గా అందిరిచేత శభాష్ అనిపించుకున్నాడు.

అయితే గత కొంతకాలంగా కెప్టెన్సీ అతడి బ్యాటింగ్ కు భారంగా మారినట్లు కనిపిస్తోంది. స్లాగ్ ఓవర్లలో తీవ్ర ఒత్తడిలో కూడా బౌలర్లకు చుక్కలు చూపించే ధోనీ ఇప్పుడు బ్యాట్ ఝులిపించడటమే మానేశాడు.

హెలాకాప్టర్ షాట్ లు పూర్తిగా కనిపించకుండా పోయాయి. అయితే ఇప్పుడు కెప్టెన్సీ భారం దిగింది. చూడాలి ధోనీ నుంచి మళ్లీ ఎలాంటి హెలికాప్టర్ షాట్ లు వస్తాయో...